logo

అక్షర ఒరవడి

నెల్లూరు కొందరి ఆలోచనలు సముద్రపు లోతుల్ని కొలుస్తాయి. మరికొందరివి హిమాలయమంత ఎత్తు ఉంటాయి. చదువంటే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పడం కాదు. అదనంగా జీవన నైపుణ్యాలు నేర్పించాలి. అయితే అవి పూర్తిస్థాయిలో వారికి అందడం లేదు. రెండేళ్లుగా చిన్నారుల

Published : 24 Jan 2022 06:12 IST

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై దృష్టి

వలస, బడిబయట పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు కొందరి ఆలోచనలు సముద్రపు లోతుల్ని కొలుస్తాయి. మరికొందరివి హిమాలయమంత ఎత్తు ఉంటాయి. చదువంటే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పడం కాదు. అదనంగా జీవన నైపుణ్యాలు నేర్పించాలి. అయితే అవి పూర్తిస్థాయిలో వారికి అందడం లేదు. రెండేళ్లుగా చిన్నారుల చదువులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. కొన్నాళ్ల పాటు తరగతులు నిర్వహించలేని పరిస్థితి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా అవి అంతంతమాత్రమే. దాంతో పాఠ్యాంశాలపై పట్టు లేక ఉత్తమ ఫలితాలు సాధించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తరగతుల వారీగా విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేలా రూపకల్పన చేసింది. బడుల్లో చదివే విద్యార్థులతో పాటు డ్రాపౌట్లు, వలస కూలీల పిల్లలకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వివరాలను సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి ఉషారాణి వివరించారు.

పఠనంపై పట్టు కోసం..

పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు అర్థవంతంగా చదివించడమే లక్ష్యంగా జిల్లాలో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘చదవడం మాకిష్టం’ అనే పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఈనెల 6వ తేదీ ప్రారంభమైంది. దాదాపు 100 రోజుల పాటు అంటే ఏప్రిల్‌ 30వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో కేవలం పాఠ్యంశాలే కాకుండా నీతికథలు, మహనీయుల జీవిత చరిత్రలు, స్వాతంత్య్ర సమరయోధులు, శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు వివరించనున్నారు. దీన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోనూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రీప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు, మూడు నుంచి అయిదు, ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయాల్లో విద్యార్థులను చదివిస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఇందుకు ఒక గంట కేటాయిస్తున్నారు.

విద్యార్థులు వెనుకంజలో లేకుండా..

పలు కారణాలతో బడి మానేసిన చిన్నారులు, వలస కూలీల పిల్లలు చదువులో వెనుకంజలో లేకుండా ఉండేందుకు సర్వశిక్షా అభియాన్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. డ్రాపౌట్ల కోసం నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ హాస్టళ్ల పేరుతో 100 మంది విద్యార్థులకు ఏడాది పాటు తరగతులు నిర్వహించనుంది. పోలీసులతో కలసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. దాంతో పాటు ఇటుక బట్టీలు, పొలాలు, పరిశ్రమల్లో పనిచేసేందుకు వలస వచ్చే కూలీల పిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు జిల్లాలోని అయిదు ప్రాంతాల్లో సీజనల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఓజిలి, జలదంకి మరో మండలంలో వచ్చే నెల నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి.

అచ్చం అలా తీర్చిదిద్దేలా..

పాఠ్యాంశంపై విద్యార్థుల దృష్టి, మనస్సు కేంద్రీకరించేలా పాఠశాలల్లోని కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. బోధన అంశంపై ఛార్టులు, బొమ్మలు, ఫ్లాష్‌కార్డులు, టూడీ, త్రీడీ చిత్రాలను ముందుగానే రూపొందించుకొని దృశ్యరూపకంగానూ వివరించనున్నారు. ఇలా ఆదర్శంగా నిలిచిన ఆ పాఠశాలను సమీప బడుల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులు సందర్శించి అదే మార్గాన్ని అనుసరించనున్నారు. ఇలా పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 100 పాఠశాలలను ఆదర్శంగా నిలిపి మరో వంద పాఠశాలలను అదేవిధంగా మార్పు (ట్విన్నింగ్‌) చేయనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలను సందర్శించేందుకు, ఇతర ఖర్చులకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఆర్ట్‌అండ్‌ క్రాఫ్ట్‌, స్థానిక పండుగలు, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

ట్విన్నింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని