logo

గంగ కాలువలో ఇద్దరి దుర్మరణం

వారు ముగ్గురూ కళాశాల రోజుల నుంచి మిత్రులు. బుధవారం సరదాగా కలిశారు. గ్రామానికి దగ్గర్లోని తెలుగుగంగ బ్రాంచి కాలువ వద్దకు వెళ్లారు. అందులోకి దిగిన కాసేపటికే.. ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందగా- ఒకరు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

Published : 27 Jan 2022 01:39 IST

పుదూరులో విషాదం


చైతన్య

జగన్‌

నాయుడుపేట, న్యూస్‌టుడే: వారు ముగ్గురూ కళాశాల రోజుల నుంచి మిత్రులు. బుధవారం సరదాగా కలిశారు. గ్రామానికి దగ్గర్లోని తెలుగుగంగ బ్రాంచి కాలువ వద్దకు వెళ్లారు. అందులోకి దిగిన కాసేపటికే.. ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందగా- ఒకరు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగుగంట బ్రాంచి కాలువ వద్ద బుధవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. పుదూరుకు చెందిన పేరాని మునెయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు జగన్‌ (22). ఐటీఐ పూర్తి చేసి.. కొన్ని నెలలుగా ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొండారి చెంచయ్య, పద్మమ్మ దంపతుల కుమారుడు చైతన్య (22). బీటెక్‌ పూర్తి చేశారు. ఇటీవలే చెన్నైలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఉద్యోగం వచ్చింది. గురువారం వెళ్లి చేరాల్సి ఉంది. వీరిద్దరి మిత్రుడు.. వాకాడుకు చెందిన మల్లు విష్ణు. ముగ్గురు కలిసి బుధవారం ఉదయం గ్రామంలో సరదాగా తిరిగారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దగ్గర్లోని తెలుగుగంగ బ్రాంచి కాలువ వద్దకు వెళ్లి ఈతకు దిగారు. ఆ క్రమంలో జగన్‌, చైతన్య నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా.. విష్ణు అతికష్టం మీద గట్టుకు చేరుకుని కేకలు వేశారు. దాంతో అక్కడికి కొంత దూరంలోని వారు వచ్చి కాలువలో గాలింపు చేపట్టేలోపే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాద స్థలం రెండు మండలాల సరిహద్దులో ఉండటంతో స్థానికులు మొదట దొరవారిసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట, దొరవారిసత్రం ఎస్సైలు సీహెచ్‌ కృష్ణారెడ్డి, తిరుమలరావు పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్షలు నియమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు యువకులు తల్లిదండ్రులకు ఏకైక పుత్ర సంతానం కావడంతో వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని