logo

దారుణహత్య

ఆటో డ్రైవరును దారుణంగా హత్య చేశారు.. బ్లేడుతో విచక్షణా రహితంగా గొంతు కోసి.. తలపై రాడ్డుతో మోది కడతేర్చారు. ఈ దారుణ ఉదంతం నెల్లూరులో శుక్రవారం వెలుగు చూసింది. పల్లిపాడులోని శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఇన్‌స్పెక్టర్‌

Published : 29 Jan 2022 06:13 IST

సంఘటనా స్థలంలో పోలీసుల దర్యాప్తు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఆటో డ్రైవరును దారుణంగా హత్య చేశారు.. బ్లేడుతో విచక్షణా రహితంగా గొంతు కోసి.. తలపై రాడ్డుతో మోది కడతేర్చారు. ఈ దారుణ ఉదంతం నెల్లూరులో శుక్రవారం వెలుగు చూసింది. పల్లిపాడులోని శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హతుడు వెంగళరావునగర్‌ మూడో వీధికి చెందిన కోటకొండ అంకయ్య, సునీత దంపతుల కుమారుడు సునీల్‌(18)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అంకయ్య.. భార్య, కుమారుడిని వదిలిపోగా- సునీల్‌ ఆటో నడుపుతూ తల్లిని పోషిస్తున్నాడు. ఈ నెల 27వ తేదీ రాత్రి 8 గంటలకు గొలగమూడికి బాడుగ వచ్చిందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి అయినా ఇంటికి రాలేదు. కాల్‌ చేస్తే సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆటో నడుపుకొంటూ ఉంటాడని భావించి.. ఆమె నిద్రపోయారు. శుక్రవారం పడారుపల్లి బుజ్జయ్య లేఅవుట్‌లో విగత జీవిగా కనిపించాడు. మృతదేహం ఉన్న ప్రాంతానికి దాదాపు 50 మీటర్ల దూరంలో రక్తపు మరకలు పడి ఉన్నాయి. దీంతో సునీల్‌ను అక్కడ హత్య చేసి.. లాక్కొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆధార్‌ కార్డు ఆధారంగా గుర్తించి.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆటో లోపలి సీట్లలో మద్యంతో ఉన్న గ్లాసులు ఉన్నాయి. మద్యం తాగి.. ఆ మత్తులో ఉండగానే సునీల్‌ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్పీ ఆగ్రహం.. ముగ్గురిపై వేటు

నెల్లూరు (నేర విభాగం) : ఆటో డ్రైవరు హత్యోదంతంపై ఎస్పీ సీహెచ్‌ విజయ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు స్టేషన్‌ పరిధిలో గస్తీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పిలిచారు. రాత్రి గస్తీ నిర్వహించిన ఆర్‌ఎస్సైను జిల్లా ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని