logo

తీరు మారకుంటే చర్యలు

మీ జిల్లాకు ఏమైంది? ఇక్కడ పనులెందుకు వేగంగా చేయరు? మీ తీరు ఏమీ బాగోలేదంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Published : 02 Oct 2022 02:03 IST

గ్రామీణ నీటి సరఫరా అధికారుల
తీరుపై ఈఎన్‌సీ అసహనం

సమావేశంలో మాట్లాడుతున్న ఈఎన్‌సీ ఆర్వీ కృష్ణారెడ్డి

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: మీ జిల్లాకు ఏమైంది? ఇక్కడ పనులెందుకు వేగంగా చేయరు? మీ తీరు ఏమీ బాగోలేదంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆయన నెల్లూరులోని ఈఈ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈ రంగప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఈఈలు, ఏఈలు, కొందరు గుత్తేదారులను సైతం పిలిపించి నేరుగా చర్చించారు. నాడు-నేడు జల్‌జీవన్‌, జగనన్న ఇళ్లు తదితర పనుల్లో జిల్లా బాగా వెనుబడి ఉందంటూ ప్రశ్నలు సంధించారు. కారణమెవరంటూ ఆరా తీశారు. ఎందుకు జిల్లాలో వేగంగా పనులు జరగడం లేదని.. ఇందులో గుత్తేదారుల పాత్ర ఏంతని అడిగారు. అందుకు కొందరు తమకు బిల్లులు సక్రమంగా రావడం లేదని, ఎవరూ ఆర్థిక భరోసా ఇవ్వడం లేదని బదులిచ్చారు.  ఒప్పందం ప్రకారం పనులు చేయండి. బిల్లులు ఆగకుండా మా వంతు చర్యలు తీసుకుంటామని సూచించారు. అధికారులపరంగా వివిధ గ్రామాల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తీరు మారకుంటే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న నెల రోజుల్లోగా జిల్లాలో జరుగుతున్న పనుల్లో మంచి మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. తాను వచ్చే నెలలో మళ్లీ వచ్చి పరిశీలిస్తానన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని