logo

కుష్ఠు రహిత సమాజమే లక్ష్యంగా సర్వే

జిల్లాలో కుష్ఠు తీవ్రత తగ్గినా.. దాని ప్రభావం మాత్రం అక్కడక్కడా కనిపిస్తోంది.

Published : 04 Dec 2022 02:34 IST

జిల్లాలో 39 కేసుల గుర్తింపు

ఉదయగిరి : సర్వేలో భాగంగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

దుత్తలూరు, ఉదయగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో కుష్ఠు తీవ్రత తగ్గినా.. దాని ప్రభావం మాత్రం అక్కడక్కడా కనిపిస్తోంది. దాంతో పూర్తిస్థాయిలో నియంత్రించి, ఇప్పటికే దాని బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టాలని జాతీయ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సర్వే ముమ్మరంగా సాగుతోంది. చిన్నపాటి లక్షణాలున్న వారిని సైతం గుర్తించి.. నమోదు జరుగుతోంది.

గత నెల 15 నుంచి...జిల్లాలో 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పది సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా వైద్యశాలలు, ఒక జిల్లా ఆసుపత్రి, మరో జీజీహెచ్‌ ఉండగా- వీటి పరిధిలోని అన్ని గ్రామాల్లో ‘చేతులు కలుపుదాం- రాష్ట్రాన్ని కుష్ఠు రహితం చేద్దాం’ అన్న నినాదంతో ఈ సర్వే చేపట్టారు. గత నెల 15 నుంచి మూడు వారాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అనుమానితులను పరీక్షించేలా కార్యాచరణ రూపొందించారు. వెల్లడైన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 39 కేసులు నమోదయ్యాయి.

భయపడాల్సిన పనిలేదు...
- వెంకటప్రసాద్‌, జిల్లా కుష్ఠు నియంత్రణ అధికారి

ప్రాథమిక స్థాయిలో కుష్ఠును గుర్తిస్తే భయపడాల్సిన అవసరం లేదు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి ఏడాదిపాటు మందులు వాడితే నయమవుతుంది. సర్వే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 39 కేసులు గుర్తించాం. అయిదో తేదీతో సర్వే ముగుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని