logo

గంజాయి మత్తు.. చేస్తోంది చిత్తు

గంజాయి మాఫియా జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆ ‘మత్తు’ ఎక్కడైనా సులువుగా దొరుకుతోంది. చిన్న ప్యాకెట్ల మొదలు కిలోల వరకు.. కావాల్సిన మొత్తంలో అందుబాటులో ఉంటోంది.

Updated : 23 Mar 2023 02:48 IST

సమిధలవుతోంది యువతే..

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)

గంజాయి మాఫియా జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆ ‘మత్తు’ ఎక్కడైనా సులువుగా దొరుకుతోంది. చిన్న ప్యాకెట్ల మొదలు కిలోల వరకు.. కావాల్సిన మొత్తంలో అందుబాటులో ఉంటోంది. విశాఖపట్టణం కేంద్రంగా దిగుమతి చేసుకుని నగరంలో బహిరంగంగానే విక్రయిస్తుండటం అధికమవుతోంది. దీన్ని తీసుకుంటున్న వారిలోనే కాదు.. తరలిస్తున్న వారిలోనూ యువకులే ఉంటుండటం.. వివిధ నేరాల్లో భాగస్వాములైన వారు గంజాయి తీసుకున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది.

అడ్డుకట్ట పడేనా..

ఇటీవల జరిగిన కొన్ని నేర సంఘటనలు.. అందులో భాగస్వాములైన వారు గంజాయి తీసుకుని ఉండటం తదితరాలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు చర్యలు సిద్ధం చేశారు. ఎక్కడెక్కడ విక్రయాలు జరుగుతున్నాయి? ఎవరెవరు విక్రయిస్తున్నారు? ఇప్పటికే గంజాయి కేసులు ఎవరెవరిపై ఉన్నాయో ఆరా తీస్తున్నారు. కేసులున్న వారు ఎలాంటి నేరాల్లో పాల్గొన్నారు? వారి కుటుంబ నేపథ్యం ఏమిటి? వారు గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చేవారు? ఎవరికి? ఎలా? విక్రయించేవారన్న విషయాలను క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. నగరంలో ఎక్కువ గంజాయి దొరికే ప్రాంతాలను గుర్తించడంతో పాటు.. ఆయా ప్రాంతాల్లోని పాత్రధారులు, సూత్రధారులను అన్వేషిస్తున్నారు. ఇప్పటి వరకు చిక్కకుండా తిరుగుతున్న వారిని సైతం పట్టుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఆయా స్టేషన్ల వారీగా వారిని గుర్తించి.. స్థానిక పోలీసులతో కాకుండా.. ఇతర స్టేషన్ల సిబ్బందిని పంపి పట్టుకోనున్నారు. విద్యా కేంద్రాల వద్ద కూడా నిఘా పెట్టనున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు, కళాశాలలను గుర్తించినట్లు సమాచారం. ఈ చర్యలతో అయినా.. అడ్డుకట్ట పడుతుందో లేదా చూడాల్సి ఉంది.


లక్ష్యం యువకులే..

జిల్లాలో యువకులనే లక్ష్యంగా చేసుకుని అక్రమార్కులు గంజాయి విక్రయాలు సాగిస్తుండగా- దాని కొనుగోలు చేసిన వారు నమిలి సిగరెట్లతో పొగ తాగడం, చేతులతో పొడి చేసుకుని హుక్కా ద్వారా తీసుకోవడం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదో ఫ్యాషన్‌లా మారిందని అంటున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్‌ మనీ, పార్ట్‌ టైం ద్వారా సంపాదించుకున్న నగదు అంతా గంజాయికే ఖర్చు పెట్టేవారున్నారంటే అతిశయోక్తి కాదని.. ఈ క్రమంలో కొందరు మత్తు కోసం చెడు మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విక్రయదారులు సైతం కళాశాలలు, హాస్టళ్లు, పారిశ్రామిక వాడలు తదితర ప్రాంతాలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని.. అర్ధరాత్రి నుంచి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.


వ్యసనం.. 700 కి.మీ. పయనం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం మండలం మార్టూరు రోడ్డుపై గంజాయి తాగుతూ ఆరుగురు పోలీసులకు చిక్కారు. వారిలో ఇద్దరు విద్యార్థులు ఏకంగా 700 కి.మీ. దూరం ప్రయాణించి.. నెల్లూరు నుంచి అనకాపల్లి జిల్లాకు వచ్చిన వారు కావడం గమనార్హం. అచ్యుతాపురం సీఐ మురళీరావు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరులో బీటెక్‌, బీసీఏ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గంజాయికి అలవాటుపడ్డారు. వీరితో పాటు గతంలో నెల్లూరులో చదువుకున్న ఓ విద్యార్థి కుటుంబం.. ప్రస్తుతం అచ్యుతాపురంలో నివాసం ఉంటోంది. అనకాపల్లిలో గంజాయి సులువుగా లభిస్తుందని తెలుసుకుని.. పాత స్నేహితుడిని సంప్రదించారు. అతడు రమ్మని పిలవడంతో.. ఈ ఇద్దరూ నెల్లూరు నుంచి మంగళవారం అచ్యుతాపురం వచ్చారు. ఈ ముగ్గురు స్నేహితులు.. స్థానికంగా ఉన్న మరో ముగ్గురితో కలిసి అనకాపల్లి చేరుకున్నారు. పట్టణంలో కిలో గంజాయి కొనుగోలు చేశారు. మంగళవారం రాత్రి మార్టూరు రోడ్డులో అంతా కలిసి గంజాయి తాగడం మొదలుపెట్టగా- ఆ సమయంలో అటుగా వెళ్లిన పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులు ఆరుగురూ 25 ఏళ్లలోపు వారేనని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి.. రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు పంపించామని సీఐ వెల్లడించారు.


భవిష్యత్తు ప్రశ్నార్థకం

శ్రీనివాస్‌రెడ్డి, నగర డీఎస్పీ

గంజాయి విక్రయించినా.. తాగినా భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. నగరంలో వివరాలు సేకరిస్తున్నాం. భవిష్యత్తులోనూ తీవ్ర పరిణామాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని