logo

పరీక్షా కాలం.. పట్టించుకోక దైన్యం!

జిల్లాలో సాంఘిక, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండల వసతి గృహాల్లో ట్యూటర్లు ఉన్నా, నెల్లూరులో పూర్తిస్థాయిలో

Published : 30 Mar 2023 03:46 IST

న్యూస్‌టుడే, నెల్లూరు (సంక్షేమం)

నందిపాడులో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు (పాతచిత్రం)

జిల్లాలో సాంఘిక, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండల వసతి గృహాల్లో ట్యూటర్లు ఉన్నా, నెల్లూరులో పూర్తిస్థాయిలో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత విద్యా సంవత్సరం తక్కువ ఫలితాలు సాధించిన హాస్టళ్లు.. ఈసారైన నూరుశాతం సాధిస్తాయా అంటే కనుచూపుమేరలో ఆ చర్యలు కనిపించడం లేదు. మరో అయిదు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ట్యూటర్ల ద్వారా బోధన జరగాల్సి ఉన్నా.. కొన్నిచోట్ల ఒకరిద్దరే ఉన్నారు.

నగరంలో దయనీయం

సాంఘిక, బీసీ సంక్షేమానికి చెందిన 96 వసతి గృహాల్లో 1,336 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఒక్కో దానికి నలుగురు ట్యూటర్లను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో 43 చోట్ల పది విద్యార్థులుండగా.. 25 చోట్ల పూర్తిస్థాయిలో ఉండగా.. మిగతా చోట్ల ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు.

మండలాల్లోని 53 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో పూర్తిస్థాయిలో ట్యూటర్లు ఉన్నారని, నెల్లూరులో తక్కువ మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వీరు ఇంగ్లిషు, గణితం, సైన్సు, హిందీ పాఠ్యాంశాలను బోధించి అభ్యసనం చేయించాల్సి ఉంది. ఎక్కువ మంది ట్యూటర్లు విద్యార్థులే చదువుకోవాలని గంటసేపు కూర్చొని వెళుతున్నారు. ట్యూటర్లకు ఒక్కొక్కరికి రూ.1500 నెలకు ఇస్తున్నారు. తక్కువ మొత్తంలో ఇస్తుండటంతో నిష్ణాతులైన బోధకులు ముందుకు రావడం లేదు. అయితే ఈ వేతనాలు కూడా సక్రమంగా రావడంలేదు.

గత ఏడాది ఇలా..

సంక్షేమ వసతిగృహాల్లో రెండేళ్లుగా ఎలాంటి బోధన ప్రక్రియ చేపట్టడం లేదు. దాంతో 2021-22 విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 530 మంది విద్యార్థులకు పరీక్ష రాస్తే 252 మంది ఫెయిల్‌ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో 512కి 139 మంది ఉత్తీర్ణులు కాలేదు.

కార్యాచరణేది?

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గతంలో ఛాలెంజ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం ద్వారా గ్రేడింగ్‌ చేసి విద్యార్థులను చదివించేవారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించేవారు. ప్రస్తుతం ఎలాంటి విధానం అమలు చేయడం లేదు. పాఠశాలలో అందించిన బోధనే దిక్కవుతోంది. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేవారు కరవయ్యారు.


నూరుశాతం ఫలితాలు సాధించేలా చర్యలు

వెంకటయ్య, బీసీ సంక్షేమశాఖ అధికారి

ఎస్సీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండల కేంద్రాల్లోని వసతిగృహాల్లో పూర్తిగా ట్యూటర్లు ఉన్నారు. నెల్లూరులోనూ విద్యార్థులను చదివించేలా వసతిగృహ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు అయ్యేంత వరకు సహాయ సంక్షేమాధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించాం. అందులో భాగంగా వారు నిత్యం తనిఖీలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని