logo

పేలుడులో గాయపడిన మరొకరి మృతి

మాముడూరులో గత నెల 27న జరిగిన బాణసంచా పేలుడుతో తీవ్రంగా గాయపడిన కోవూరు వాసి చలంచర్ల రమేష్‌(32) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గురువారం ఎస్సై మరిడినాయుడు తెలిపారు.

Published : 09 Jun 2023 02:15 IST

చేజర్ల, న్యూస్‌టుడే: మాముడూరులో గత నెల 27న జరిగిన బాణసంచా పేలుడుతో తీవ్రంగా గాయపడిన కోవూరు వాసి చలంచర్ల రమేష్‌(32) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గురువారం ఎస్సై మరిడినాయుడు తెలిపారు. నెల్లూరులో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురు కోలుకొని ఇళ్లకు వెళ్లారని పేర్కొన్నారు.


అత్యాచార యత్నం కేసులో నిందితులకు రిమాండ్‌

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: బధిర మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితులకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కందుకూరు మండలంలోని మాచవరం ఎస్సీ కాలనీకి చెందిన ఓ బధిర మహిళపై పట్టణానికి చెందిన ఫైరోజ్‌బాషా, కరణ్‌, జోషి పట్టణ శివారులో మంగళవారం రాత్రి అత్యాచారానికి యత్నించారు. పెట్రోల్‌ బంకు సిబ్బంది, దిశ యాప్‌ ద్వారా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను రక్షించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి  రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.


పేలిన బ్యాటరీ ద్విచక్రవాహనం

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: బ్యాటరీ వాహనం పేలి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన గురువారం ముదివర్తిపాలెంలో జరిగింది. బాధితుడి వివరాల మేరకు గ్రామానికి చెందిన చిట్టిబోయిన శివకుమార్‌ కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గురువారం పొలంలోకి వెళ్లేందుకు వాహనాన్ని ఆన్‌ చేయగా ఒక్కసారికి బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని సదరు కంపెనీ ప్రతినిధులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వాహనదారుడు పేర్కొన్నారు.


మినీ వ్యానును ఢీకొన్న కారు

28 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

రాపూరు, న్యూస్‌టుడే: కారు ఢీకొనడంతో మినీ వ్యాను బోల్తాపడి 28 మందికి గాయాలైన ఘటన గురువారం మండలంలోని పెనుబర్తి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వాలిచెర్లకు చెందిన పలువురు తోటపల్లిగూడూరు మండలంలోని ఓ ప్రార్థనా మందిరానికి మినీవ్యాన్‌లో పయనమయ్యారు. పెనుబర్తి సమీపంలో రాపూరు నుంచి వెళుతున్న కారు  ఢీకొనడంతో అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో జాతీయ రహదారి అంబులెన్స్‌ వచ్చే దాకా క్షతగాత్రులు ఇబ్బందులుపడ్డారు. వీరిని రాపూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యాధికారిణి సరస్వతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాపూరు ఎస్‌ఐ రంగనాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని