logo

కన్నీటి శృతి

తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది.

Updated : 28 Mar 2024 06:23 IST

తల్లి చావు కబురుతో తల్లడిల్లి

పరీక్షలుండడంతో ఆలస్యంగా సమాచారం

 

మంచాన పడిన తండ్రి వద్ద కుమారుడు, కుమార్తెలు

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున మోపాడు సమీపంలో ఆటో ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమాదంలో డి.లక్ష్మి మరణించింది. సాయంత్రానికి శవపంచనామా పూర్తి చేసి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని ఇచ్చారు. మృతురాలి కుమార్తె శృతి ఒంగోలు పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం జీవశాస్త్రం, బుధవారం సాంఘిక పరీక్షలు ఉండటంతో చిన్నారికి.. తల్లి మరణించి సమాచారం చెప్పలేదు. బుధవారం పరీక్ష రాసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి.. మాతృమూర్తికి అంత్యక్రియలు నిర్వహించారు.

 చదువు మానేసిన సింహమణి

మృతురాలి భర్త హరిబాబు అనారోగ్యంతో మంచాన పడడంతో ఇంటికి పెద్దదిక్కుగా ఉండే కుమారుడు సింహమణి రెండేళ్లుగా చదువుమాని (పదో తరగతి) కుటుంబ పోషణ కోసం కూలికి వెళ్తున్నారు. ఇతనితోపాటు తల్లి సంపాదించేది. తల్లి మరణంతో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు కుమార్తెల్లో శృతి పది పరీక్షలు రాయగా.. శ్రావణి పట్టణంలోని ఉన్నత పాఠశాలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఆదుకోవాలని ఆందోళన

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, కాలనీవాసులు గ్రామీణ పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ట్రాక్టర్‌ యజమాని మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్సై రాజేశ్‌ కేసు నమోదు, వెంటనే ఛార్జ్‌షీటు దాఖలు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని