logo

చంద్రబాబు ప్రజాగళం నేడే

న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్‌షో, సభల్లో పాల్గొననున్నారు.

Published : 29 Mar 2024 03:34 IST

కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి చేసిన తెదేపా శ్రేణులు

ఈనాడు, నెల్లూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్‌షో, సభల్లో పాల్గొననున్నారు. ఆ మేరకు తెదేపా నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత తొలిసారి చంద్రబాబు నెల్లూరు జిల్లాకు వస్తుండటంతో పెద్దఎతున స్వాగతం పలికేందుకు ప్రణాళికలు చేశారు. నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో మాట్లాడి.. ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయించి.. వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో.. రోడ్‌షో, సభ జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కావలి, ఉదయగిరి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్‌లు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. వైకాపా ప్రభుత్వ అరాచక పాలనను అంతమొందించి.. ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందించడమే లక్ష్యంగా చంద్రబాబు పోరాడుతున్నారని తెలిపారు. ఈ సభల ద్వారా యువతను చైతన్యపరచడంతో పాటు గడిచిన అయిదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తారన్నారు.  


రాత్రి వింజమూరులో బస

చంద్రబాబునాయుడు శుక్రవారం బనగానపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం కావలి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3 గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని ఎ.ఎం.బేకరి వద్ద జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30కి బయలుదేరి హెలిప్యాడ్‌ దగ్గరకు చేరుకుంటారు. 5 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు బయలుదేరుతారు. 5.15 గంటలకు శ్రీ రాఘవేంద్ర ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు, 5.25కి బస్టాండ్‌ సమీపంలోని ప్రధాన రహదారికి చేరుకుంటారు. 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో వింజమూరులోని ఎస్‌.వి.కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని