logo

మంత్రి, ఎమ్మెల్యేలుగా పనిచేసి..జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై..

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులు అధిరోహిస్తుంటారు. ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేరి ఉన్నత పదవి చేపట్టాలని కలలు కంటూ ఉంటారు

Published : 31 Oct 2023 05:59 IST

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: సాధారణంగా రాజకీయ నాయకులు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులు అధిరోహిస్తుంటారు. ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేరి ఉన్నత పదవి చేపట్టాలని కలలు కంటూ ఉంటారు. కాని ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నాయకులు మాత్రం ఉన్నత పదవులు చేపట్టిన తర్వాత పార్టీ ఆదేశానుసారం చిన్న పదవులకు కూడా పోటీ చేసి నెగ్గారు. వారెవరో కాదు ఆర్మూర్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి, బోధన్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్త రమాకాంత్‌.

జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా..

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన శనిగరం సంతోష్‌రెడ్డి అప్పటికే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌ను వదిలి తెరాసలో చేరారు. కేసీఆర్‌తో కలిసి పార్టీకి సేవలందించారు. 2001-2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వం ఉంది. అదే ఏడాది జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రకటన వచ్చింది. క్షేత్రస్థాయిలో తెదేపా బలంగా ఉండే రోజులవి. కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంతోష్‌రెడ్డి ఆర్మూర్‌ జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేయాల్సి వచ్చింది. తెరాస జడ్పీటీసీ సభ్యులు అధికంగా గెలిస్తే సంతోష్‌రెడ్డినే జడ్పీఛైర్మన్‌గా ఎంపిక చేస్తామని కేసీఆర్‌ ప్రకటించాడు. దీంతో ఆర్మూర్‌ మండలం నుంచి సంతోష్‌రెడ్డి సునాయసంగా విజయం సాధించాడు. జిల్లావ్యాప్తంగా తెరాస ప్రభంజనం సృష్టించింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ముందే అనుకున్నట్లు సంతోష్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. 2004లో ఆర్మూర్‌ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

గెలిచి.. రాజీనామా చేసి..

బోధన్‌ నియోజకవర్గంలో తెదేపా నుంచి 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కొత్త రమాకాంత్‌. 1994 వరకు పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రమాకాంత్‌ను తెదేపా అధిష్ఠానం బోధన్‌ మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయించింది. జిల్లాలో అత్యధిక స్థానాలు వస్తే రమాకాంత్‌ను జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ఎంపిక చేస్తామని పార్టీ పెద్దలు భావించారు. అయితే ఆ ఎన్నికల్లో బోధన్‌ నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించిన రమాకాంత్‌ తర్వాత పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని