logo

8 మంది హ్యాట్రిక్‌ వీరులు

క్రికెట్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బౌలర్‌కు గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లోనూ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాయకులు తమకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

Published : 04 Nov 2023 04:05 IST

ఉమ్మడి జిల్లాలో వరుసగా గెలుపొందిన ఎమ్మెల్యేలు
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

మండవ వెంకటేశ్వర్‌రావు

క్రికెట్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బౌలర్‌కు గుర్తింపు వస్తుంది. రాజకీయాల్లోనూ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాయకులు తమకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హ్యాట్రిక్‌ ఘనత సాధించారు. కొందరు మంత్రులుగానూ బాధ్యతలు నిర్వహించారు.

కేఆర్‌ సురేశ్‌రెడ్డి

నలుగురు నాలుగుసార్ల చొప్పున

జిల్లాకు చెందిన నలుగురు నేతలు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సైతం వీరికి మరిన్ని విజయాలు లభించాయి. డిచ్‌పల్లి (ప్రస్తుతం నిజామాబాద్‌ రూరల్‌) నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మండవ వెంకటేశ్వర్‌రావు వరుసగా నాలుగు మార్లు( 1985, 1989, 1994, 1999) ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఇక బాల్కొండ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన కేఆర్‌ సురేశ్‌రెడ్డి 1989, 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతిగా పనిచేశారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2009లో విజయం సాధించారు. అనంతరం తెరాస అభ్యర్థిగా 2010-11 ఉప ఎన్నికలో, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. గతంలో మంత్రిగా, ప్రస్తుతం తెలంగాణ శాసనసభాపతిగా పనిచేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా గంప గోవర్ధన్‌ 2009లో విజయం సాధించారు. తెరాస తరఫున 2012, 2014, 2018 ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. ప్రభుత్వ విప్‌గా సేవలు అందిస్తున్నారు.

పోచారం శ్రీనివాస్‌రెడ్డి

వరుసగా మూడు మార్లు విజయాలు సాధించిన ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజవర్గానికి చెందిన నేరేళ్ల ఆంజనేయులు 1989, 1994, 1999 ఎన్నికల్లో తెదేపా నుంచి విజయం సాధించారు. మంత్రిగా పనిచేశారు. బోధన్‌ నియోజకవర్గం నుంచి పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయాలు సాధించారు. మంత్రిగా సేవలందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన హన్మంత్‌షిండే 2009లో తెదేపా అభ్యర్థిగా, 2014, 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా విజయాలు సాధించారు.

గంప గోవర్ధన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని