logo

నిజామాబాద్‌ బరిలో జీవన్‌రెడ్డి

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్‌రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది.

Updated : 28 Mar 2024 04:46 IST

సీనియర్‌ వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు
ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, జగిత్యాల

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్‌రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. ఆయన ప్రస్తుతం నిజామాబాద్‌-ఆదిలాబాద్‌- ఖమ్మం, ఉమ్మడి మెదక్‌ జిల్లా పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన, నవంబరులో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కానీ, పార్టీలో అనుభవం గల నాయకుడిగా ఉండటంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి నిలపాలని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మొదటి జాబితా సందర్భంలోనే నిర్ణయం జరిగినప్పటికీ.. సీట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాల అంశం చర్చకు రావటంతో ప్రకటన ఆలస్యమైంది. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించుతూ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సూచించిన పేరునే ఖరారు చేసింది.

సమితి అధ్యక్షుడి నుంచి మంత్రి వరకు..

పాఠశాల విద్య ఉమ్మడి కరీంనగర్‌లోనే పూర్తి చేసిన జీవన్‌రెడ్డి, హైదరాబాద్‌లో బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. 1981లో మల్యాల సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1983లో తొలిసారిగా తెదేపా నుంచి జగిత్యాల శాసనసభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఆబ్కారీశాఖ మంత్రిగా పనిచేశారు. 1985లో కాంగ్రెస్‌లో చేరారు. పదకొండు సార్లు శాసనసభకు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు. లోక్‌సభ స్థానానికి ఆయన పోటీ చేయటం ఇది మూడోసారి. 2006, 2008లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ చేతిలో ఓటమి చెందారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రోడ్లు-భవనాలశాఖ మంత్రిగా పనిచేశారు.

ముగ్గురు ఒకే తీరున...

భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మూడు వేర్వేరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఇలా ముగ్గురు ఒకే పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయి.. ఒకే లోక్‌సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండటం గమనార్హం.


ఇక ప్రచార బాట

భాజపా, భారాస నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ధర్మపురి అర్వింద్‌ గత నెలలోనే ప్రచారం ప్రారంభించగా.. ఇటీవల భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ తన ప్రచారాన్ని జగిత్యాల జిల్లా నుంచి మొదలుపెట్టారు. అభ్యర్థిగా ఖరారు కాకముందే జీవన్‌రెడ్డి.. జగిత్యాల జిల్లాలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. జీవన్‌రెడ్డి 30వ తేదీన నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఆయన ఇప్పటికే నిజామాబాద్‌లో ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పేరు ఖరారు కావటంతో ఇక మూడు పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. భాజపా ఇప్పటికే నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశాలు ప్రారంభించింది. ఇదే తీరున మిగతా పార్టీలూ సమావేశాలు నిర్వహించే ఆలోచనతో ఉన్నాయి. ఇందుకోసం వ్యూహాలను పార్టీల పరంగా సిద్ధం చేస్తున్నప్పటికీ.. అభ్యర్థులు సొంతంగా ప్రణాళికలు రచించారు. ఎన్నికలకు ఇంకా గడువు ఉండటంతో నింపాదిగా..ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని