logo

రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత

సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.

Updated : 19 Apr 2024 06:14 IST

ఈనాడు, నిజామాబాద్‌ : సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అధికారులు అక్రమాల కట్టడికి తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖతో ఆబ్కారీ శాఖ సిబ్బంది, ఇతర ప్రత్యేక బృందాలు నిఘా ఏర్పాటు చేసి చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశాయి. గురువారం నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నాయి. ఇదే క్రమంలో మద్యం, మత్తు పదార్థాలను తనిఖీలో భాగంగా స్వాధీనం చేసుకున్నాయి. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తుండగా రూ.52,71,707 నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు నియమించిన గ్రీవెన్స్‌ కమిటీ ఆదేశాలతో ఐదు కేసులకు సంబంధించి రూ.15,83,130 నగదు తిరిగిచ్చేశారు. మిగతా డబ్బు ఆదాయశాఖకు అప్పగించారు. 16,547 లీటర్ల మద్యం పట్టుకున్నారు. విలువ రూ.29.66 లక్షలుగా పేర్కొన్నారు. ఇందులో పోలీసుశాఖ 2,636 లీటర్లు పట్టుకోగా, ఆబ్కారీశాఖ 13,911 లీటర్లు పట్టుకుంది.

తిరిగి తనిఖీలు ముమ్మరం.. ఎన్నికల షెడ్యూల్‌ నాటి నుంచి 77 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఇవి మూడు షిప్టుల్లో పనిచేస్తూ నిఘా ఉంచుతాయి. అక్రమంగా నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ఓటర్లకు తాయిలాలుగా అందించే వస్తువుల రవాణాను అడ్డుకోవాల్సి ఉంటుంది. వ్యాపార వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రెండు వారాల కిందట నోటిఫికేషన్‌ వచ్చే వరకు తనిఖీలను  నిలిపివేశారు. అంతర జిల్లాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరగలేదు. గురువారం నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు, అంతర జిల్లా చెక్‌పోస్టులను  పునరుద్ధరించి తనిఖీలు ముమ్మరం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని