logo

విమర్శల జోరు... కేరింతల హోరు

మెదక్‌ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్‌ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్‌-జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల భాజపా విశాల్‌ జనసభలో కాంగ్రెస్‌ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు.

Published : 01 May 2024 05:15 IST

విశాల్‌ జనసభలో జోష్‌ నింపిన మోదీ ప్రసంగం

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట, జోగిపేట టౌన్‌, అల్లాదుర్గం:  మెదక్‌ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్‌ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్‌-జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల భాజపా విశాల్‌ జనసభలో కాంగ్రెస్‌ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. భారాస రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్‌, భారాస తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తీరును వివరించారు. సభకు రెండు నియోజకవర్గాల నుంచి భారీగా హాజరైన జనం ప్రధాని ప్రసంగిస్తున్నంత సేపు ‘మోదీ మోదీ’ అంటూ కేరింతలతో హోరెత్తించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌, భారాసలు కేంద్ర ప్రభుత్వంతో పాటు భాజపాపై చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టారు.

కమలదళంలో ఉత్సాహం

సభ విజయవంతం కావడంతో కమలదళంలో ఉత్సాహం నెలకొంది. కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌లతో పాటు మెదక్‌ నియోజవకర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ప్రధాని ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ లక్ష్మణ్‌, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, గంగారాం, అరుణతార, నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గోదావరి, సంగప్ప, గడ్డం శ్రీనివాస్‌, మోహన్‌, జైపాల్‌రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, విఠల్‌, వినయ్‌కుమార్‌, పైలా కృష్ణారెడ్డి , తానాజీరావు, నీలం చిన్నరాజులు, ప్రభాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


జహీరాబాద్‌ అభివృద్ధిలో అగ్రగామి

- బీబీపాటిల్‌, జహీరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి

త పదేళ్లకాలంలో జహీరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని బీబీపాటిల్‌ అన్నారు. ప్రస్తుతం కొన్ని ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఇవి పూర్తికావాలంటే తనను గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. భాజపాకు చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు సాధించడం తేలికవుతుందన్నారు.


రేవంత్‌తో హరీశ్‌ కుమ్మక్కు

- రఘనందన్‌రావు, మెదక్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భారాస నేత హరీశ్‌రావు కుమ్మక్కయ్యారని రఘునందన్‌రావు ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు అల్లుడి భయం పట్టుకుందని, కేసీఆర్‌కు జలక్‌ ఇచ్చేందుకే మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు హరీశ్‌ పంపించారన్నారు. మార్చి 19న ఎమ్మెల్సీ కవితను పరామర్శించేందుకు దిల్లీ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో రేవంత్‌రెడ్డి, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారన్నారు. ఈ సమయంలో దాదాపు రెండు గంటల పాటు మంతనాలు సాగించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం అవకతవకల్లో మొదటి ముద్దాయి హరీశ్‌రావేనన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆయన పేరును చేర్చడం లేదన్నారు. జహీరాబాద్‌, మెదక్‌ స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు.


నిజానికి, అబద్ధానికి జరుగుతున్న ఎన్నికలు

- వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, కామారెడ్డి

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు నిజానికి, అబద్ధానికి జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, భారాస అబద్ధాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హోంమంత్రి అమిత్‌షా సిద్దిపేటలో మాట్లాడిన మాటలను వక్రీకరించి కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ తప్పుడు ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించడం దారుణమన్నారు. భాజపా కార్యకర్తలకు ఏదైనా సాధించే సత్తా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని