logo

పరిధి దాటింది.. బిల్లు వచ్చింది

ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్‌కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు.

Published : 01 May 2024 05:09 IST

వినియోగం పెరగడంతో తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య
కామారెడ్డి సంక్షేమం, న్యూస్‌టుడే

ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్‌కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. గృహాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరాయంగా నడుస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు 200 యూనిట్ల పరిధి దాటుతున్నారు. దీంతో వారు బిల్లుల చెల్లింపు పరిధిలోకి వస్తున్నారు. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌కు వచ్చేసరికి 4,516 మంది వినియోగదారులు పరిధి దాటడంతో బిల్లులు వచ్చాయి. ఒకవేళ వీరు మళ్లీ 200 యూనిట్లలోపు వాడుకుంటే మళ్లీ శూన్య బిల్లులు వస్తాయి.

గృహావసరాలకే డిమాండ్‌..

జిల్లావ్యాప్తంగా వ్యవసాయ సీజన్‌ తగ్గింది. వరికోతలు పూర్తికావడంతో రైతులు బోరుబావులకు విశ్రాంతి ఇచ్చారు. కాని గృహావసరాలకే విద్యుత్తు డిమాండ్‌ అధికంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాకు నిత్యం 4.65 మిలియన్‌ యూనిట్లు కోటా కేటాయించారు. ఇందులో సరాసరిగా 2.22 మిలియన్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. అందులో వాణిజ్య, పరిశ్రమల అవసరాలు పోను మిగతా విద్యుత్తును గృహావసరాలకే వినియోగిస్తున్నారు. మేలో గృహావసరాల డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్‌ 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గృహజ్యోతి వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది.

ఎలక్ట్రానిక్‌ వస్తువులకు గిరాకీ..

ఉక్కపోతలు, ఎండలతీవ్రత కారణంగా వినియోగదారులు ఎలక్ట్రానిక్‌ వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తుండడంతో చాలా మంది వినియోగదారులు ఫ్యాన్లు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఏసీలు కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఒక్క నిమిషం విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగినా ఫ్యాన్లు, కూలర్లు నడవక వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో విద్యుత్తు వినియోగం ఒక్క సారిగా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని