logo

తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి

పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు.

Updated : 26 Apr 2024 06:13 IST

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం : పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం గమనించాలనే పాఠం నేర్పిస్తుంది. ఇదివరకే ఇంటర్‌, పది పరీక్షలు పూర్తయి పిల్లలు ఆనందంగా గడుపుతున్నారు. బడులకు సెలవులు రావడంతో వారికి ఇతర తరగతుల విద్యార్థులు తోడయ్యారు. పిల్లల సమూహం పెరగడంతో  సందడి చేయడానికి వచ్చే ఆలోచనల సంఖ్య పెరుగుతుంది. అనుకున్నదే తడువు ఆచరణలోకి దిగేస్తారు. ఈ క్రమంలోనే అనుకోని ఘటనలు చోటు చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడంలేదు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబితే కుదరదు. వారిని కాపాడుకోవడానికి మరింతగా కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సెలవులు సద్వినియోగం చేసుకునేలా వారిని ప్రోత్సహిస్తూ, హద్దుల్లో ఉంటూనే ఉల్లాసంగా గడపడానికి ఆస్కారం కల్పించాలి. ప్రధానంగా ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూనే ఏం చేస్తారో దానిపై కూడా ముందే అంచనాకు రావాలి. వాటి ఆధారంగా పిల్లలను కట్టడి చేయొచ్చు.

పాటించాల్సినవి..

  •   వేసవి తాపానికి చల్లగా సేద తీరడానికి జలవనరులను ఆశ్రయిస్తారు. ఈతకు వెళ్లి నీట మునిగి మృతిచెందే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సమీపంలోని జల వనరులపై పిల్లలకు అవగాహన కల్పించాలి. అక్కడకు వెళితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర్పించాలి.
  •  ఈత తర్వాత వారు ఎక్కువగా వినియోగించేది వాహనాలనే. ఇంటి ఎదుట వాహనం నిలిపితే చాలు తాళం తీసుకుని స్నేహితులతో విహరిస్తుంటారు. అడ్డూఅదుపు లేకపోవడంతో రహదారులపై చేసే విన్యాసాలు తమతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది. ఊరి పొలిమేరలు దాటేసి జాతీయ రహదారులపైకి దూసుకొస్తున్నారు. గురువారం తెల్లవారుజామున వరంగల్‌ జిల్లాలో నలుగురు ఇంటర్‌ విద్యార్థులు అలా వెళ్లే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాహనం నడిపే సమయంలో జరగరానిది ఏదైనా జరిగితే ఎలా అన్నది పిల్లల తల్లిదండ్రులు గ్రహించాలి.
  •  తర్వాత చరవాణి (మొబైల్‌) వాడకం ప్రధానమైంది. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను దేనికి ఉపయోగిస్తున్నారు అనేది గమనించాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లు, వాటి భద్రతను పరీక్షించాలి. చరవాణిని సమాచారం నిమిత్తం ఉపయోగించాలని అవగాహన కల్పించాలి. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? వారు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా? వారిలో ఏవైనా కుంగుబాటు ఆలోచనలు ఉన్నాయా? వంటివి నిత్యం కనిపెడుతూ ఉండాలి. ప్రమాదకర, సాహసోపేతమైన ఆటలు, విన్యాసాలకు దూరంగా ఉంచాలి.

  •  ఈ నెల 13న ముగ్గురు యువకులు ఈతకు వెళ్లి ఒడ్యాట్‌పల్లిలో మృతి చెందారు.
  •  16న ఎడపల్లిలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
  •  18న రెంజల్‌ గోదావరిలో ఈతకు వెళ్లి నవాజ్‌ అనే బాలుడు మృతి చెందాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని