logo

పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు.

Published : 30 Apr 2024 05:54 IST

జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటు

మే 1 నుంచి 31 వరకు శిక్షణ

 కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో శిక్షకులను ఎంపిక చేశారు. దీంతో వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండే విద్యార్థులు వారికి ఇష్టమైన క్రీడలో నెల రోజుల పాటు నైపుణ్యం సాధించవచ్చు. శిక్షకులకు క్రీడా సామగ్రికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 11 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

 నిర్వహణకు నిధులు మంజూరు

 శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు మంజూరు చేసింది. ఇందులో క్రీడా పరికరాల కోసం రూ.50 వేలు ఖర్చు చేస్తారు. ఒక్కో శిక్షకుడికి నెలకు రూ.4 వేలు గౌరవ వేతనం అందజేస్తారు. ఈ లెక్కన 11 కేంద్రాలకు రూ.44 వేలు ఖర్చవుతుంది. నిర్వహణ ఖర్చులకు రూ.6 వేలు, ప్రథమ చికిత్స కిట్‌కు రూ.5 వేల చొప్పున నిధులు వెచ్చించాలని అధికారులు నిర్ణయించారు. నెల రోజుల పాటు కొనసాగే క్రీడల నిర్వహణ పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. క్రీడా శిబిరాల నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తారు.

14 ఏళ్ల వారికే..

శిబిరాల్లో 14 ఏళ్ల బాలబాలికలకు మాత్రమే శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వయస్సు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. శిబిరాల్లో అన్ని ఆటలకు ప్రాధాన్యమిస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఉంటుంది. ప్రతి శిబిరంలో మెడికల్‌ కిట్‌, నీటి వసతి ఏర్పాటు చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చాలా చోట్ల క్రీడా శిబిరాలను ప్రారంభించి మధ్యలో వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వీటి నిర్వహణపై దృష్టి సారిస్తే పల్లె క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ఈ విషయమై యువజన సర్వీసులు, క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని