logo

రాజకీయ సోదాలు

బరగఢ్‌ జిల్లాలోని పద్మపూర్‌ స్థానం నిలుపుకోవడానికి బిజద, భాజపా, కాంగ్రెస్‌ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ పోరులో శంఖం, కమలం పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి.

Updated : 30 Nov 2022 04:04 IST

పద్మపూర్‌లో చర్చనీయాంశమైన రాజకీయాలు


‘బొట్టే కాదు... ఓటూ కావాలి’ బర్షా ప్రచారం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బరగఢ్‌ జిల్లాలోని పద్మపూర్‌ స్థానం నిలుపుకోవడానికి బిజద, భాజపా, కాంగ్రెస్‌ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ పోరులో శంఖం, కమలం పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) అధికారులు బిజదకు మద్దతుదారులైన ముగ్గురు ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దీనికి ప్రతీకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అధికారులు భాజపా మద్దతుదారులైన వస్త్ర వ్యాపారులు, పెట్రోలు పంపుల్లో సోదాలు చేపట్టారు. దీనికి నిరసనగా పద్మపూర్‌ వాణిజ్య సంఘం మంగళవారం వ్యాపార సంస్థలు, దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకోగా, బరగఢ్‌ ఎస్పీ పర్మార్‌ స్మిత్‌ జోక్యంతో వాయిదా వేశారు. మరోవైపు సోమవారం రాత్రి భాజపా నేత దిలీప్‌ సేనాపతిని దుండగులు అపహరించారు. ఇది బిజద నేతల పనేనని పద్మపూర్‌ భాజపా అభ్యర్థి ప్రదీప్‌ పురోహిత్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఝార్బంద్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున దిలీప్‌ సేనాపతిని గుర్తించారు. పద్మపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాలేశ్వర్‌ ఎంపీ ప్రతాప్‌ షడంగి కారును అటకాయించి పోలీసులు తనిఖీలు చేసిన సంఘటనను భాజపా పెద్దలు తీవ్రంగా పరిగణించారు. ఓటమి భయంతోనే అధికారంలో ఉన్న బిజద అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వారు ఆరోపించారు. నిత్యం రెండు పార్టీల నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

వీధి సభలు.. రోడ్‌ షోలు..

పద్మపూర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బిజద అభ్యర్థి బర్షారాణి సింగ్‌ బరిహకు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీధి సభలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలిక్కడ మకాం వేశారు. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమార్‌, అశ్వినీ వైష్ణవ్‌లు భాజపా తరఫున ప్రచారం చేస్తున్నారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, బిశ్వేశ్వర టుడు, ఎంపీలు, ఇతర నాయకులు ప్రదీప్‌ పురోహిత్‌కు మద్దతుగా పాదయాత్రలు చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌, మాజీ మంత్రులు, ఇతర నాయకులు పార్టీ అభ్యర్థి సత్యభూషణ్‌ సాహు తరఫున ప్రచారం చేస్తున్నారు.

‘అవ్వా... నీ ఓటు నాకే...’ ఓ వృద్ధురాలిని అభ్యర్థిస్తున్న ప్రదీప్‌


మాకూ సమయం వస్తుంది..

భాజపా రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... తమకూ సమయం వస్తుందని, బిజద పెద్దల అధికార దుర్వినియోగానికి సమాధానం చెబుతామని అన్నారు. పద్మపూర్‌లో పరాజయం తథ్యమని తెలిసిన బిజద నేతలు క్షీణ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.


సోదాలు ప్రారంభించింది వారే

బిజద అధికార ప్రతినిధి శశిభూషణ్‌ బెహర, మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పద్మపూర్‌లో సోదాలు ప్రారంభించింది భాజపా పెద్దలేనని ఆరోపించారు. అధ్వాన రాజకీయాలు చేస్తున్నవారు ఇతరులకు నీతులు చెబుతున్నారని, పద్మపూర్‌లో భాజపా ఓటమి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.


ప్రజలంతా చూస్తున్నారు

పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ మంగళవారం పద్మపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పద్మపూర్‌లో బిజద, భాజపాల దుర్వినియోగం, నాయకుల డ్రామాలు ప్రజలు చూస్తున్నారని, ఈ రెండు పార్టీలను తిప్పికొడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యభూషణ్‌ సాహును ఓటర్లు గెలిపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని