logo

కొత్తపద్దుపై కోటి ఆశలు

బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వే పార్లమెంట్‌ సభ్యుల ముందుంచారు.

Published : 01 Feb 2023 03:50 IST

ప్రముఖులు, సామాన్యుల అభిప్రాయాలు వెల్లడి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వే పార్లమెంట్‌ సభ్యుల ముందుంచారు. బుధవారం దిగువ సభలో 2023-24 ఆర్థిక పద్దును ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మండుతున్న ధరలు, ఉపాధి అవకాశాలు, పన్నులు, వేతన జీవుల ఇబ్బందులపై సానుకూల నిర్ణయాలు ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.

ఆశాభావం..

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర పాలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన కేటాయింపుల్లో కోత విధించిందన్న విమర్శలున్నాయి. ఆర్థికంగా వెనకబడిన ఒడిశాకు 90:10 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాలని నేతలు ఎంతో కాలంగా కోరుతున్నారు. దీంతోపాటు ప్రత్యేక హోదా డిమాండ్‌ ఉంది. రైల్వే, రహదారుల విస్తరణ, ఓడరేవులు, ఎయిర్‌ కనెక్టివిటీ, ఇతర మౌలిక వసతుల పట్ల వరాల జల్లు కురిపించాలని, ఐఐటీ, ఐజర్‌, ఐఐఎం, వైద్య విద్యా సంస్థల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతోపాటు ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనిచ్చి అంకుర సంస్థలను ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ ఉండాలని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమివ్వాలి

ఆర్థికశాఖ మాజీ మంత్రి పంచానన్‌ కానుంగో విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేయాల్సి అవసరం ఉందన్నారు. ఉపాధి అవకాశాలు, నిర్మాణ రంగానికి ప్రాధాన్యమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.


ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలి

బిజద నేత ఎం.చంద్రశేఖర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని, వారిలో నైరాశ్యం కనిపిస్తోందని, ఉద్యోగ అవకాశాలపై కేంద్రం దృష్టిపెడితే మంచి నిర్ణయమవుతుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలన్నారు.


దేశంలో ఉత్పత్తులు పెరగాలి

భాజపా నాయకుడు పొంచు బెహర మాట్లాడుతూ... విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి, దేశంలో ఉత్పత్తి పెంచాలని జనాకర్ష పథకాలతో పాటు ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని