logo

మంత్రి సరకపై పోలీసులకు ఫిర్యాదు

హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసిన రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరకకు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది.

Published : 17 Apr 2024 05:32 IST

తాగునీటి కోసం ప్రశ్నిస్తే అనుచరులతో దాడి చేశారంటూ ఆరోపణ 

రఘుబారి గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసిన రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ సరకకు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. నియోజకర్గ పరిధిలో రఘుబారి గ్రామానికి ప్రచారం కోసం వెళ్లిన ఆయనకు గ్రామంలోని తాగునీటి సమస్యను తెలియజేసేందుకు మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. దీనిని సహించలేని మంత్రి అనుచరులు గ్రామస్థులపై దాడికి దిగడంతో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే... బిసంకటక్‌ సమితి రఘుబారి గ్రామానికి మంత్రి సరక ఆదివారం ప్రచారానికి వెళ్లారు. ఏడాదిగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా తమ గ్రామంవైపు కన్నెత్తి చూడని మంత్రి ఇప్పుడు ఓట్ల కోసం ఎలా వచ్చారని గ్రామస్థులు ప్రశ్నించారు. తమ సమస్య ఆయనకు తెలియజేసేలా మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, మంత్రి అనుచరులకు వాగ్వాదం చోటు చేసుకోగా, సహనం కోల్పోయిన మంత్రి అనుచరులు తమపై దాడికి పాల్పడి, దుర్భాషలాడారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సరక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బిజద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సుధీర్‌ దాస్‌ గ్రామస్థులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కేసులు నమోదు

ఈ ఘటనకు సంబంధించి అంబోదల పోలీస్‌ స్టేషన్లో ఇరువర్గాల వారు సోమవారం పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మంత్రి సరక, సుధీర్‌దాస్‌ అనుచరులు తమను దుర్భాషలాడుతూ, గ్రామానికి చెందిన కొందరు యువకులపై చేయిచేసుకున్నారని ఆరోపిస్తూ హరకృష్ణ బెహరా, హరేంద్ర గౌడ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామస్థులు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మంత్రి అనుచరులు ఫిర్యాదు చేయడం గమనార్హం. గ్రామానికి చెందిన రఘునాథ్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సమస్యల గురించి మంత్రిని ప్రశ్నించామని, దీంతో వారి అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. చంచల బెహరా అనే మహిళ మాట్లాడుతూ మంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఖాళీ బిందెలతో నిరసన తెలపగా ఆయన వెంట వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడారన్నారు. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు యువకులపై వారు దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సుధీర్‌ దాస్‌ మాట్లాడుతూ ఇదంతా ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని