logo

మాటల ముత్యాలు

దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి...?, రాజకీయ, నైపుణ్య, సాంకేతికత తదితర అంశాలపై యువత ఏమనుకుంటోంది...? ఏం కోరుకుంటోంది...? వారేం చేయాలనుకుంటున్నారు..? ఏం చేస్తే బాగుంటుంది..? ఇలా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యూత్‌ పార్లమెంట్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Updated : 06 Feb 2023 05:01 IST

యూత్‌ పార్లమెంట్‌కు నలుగురి ఎంపిక

ఆన్‌లైన్‌లో అభ్యర్థుల ఉపన్యాసం వింటున్న న్యాయ నిర్ణేతలు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి...?, రాజకీయ, నైపుణ్య, సాంకేతికత తదితర అంశాలపై యువత ఏమనుకుంటోంది...? ఏం కోరుకుంటోంది...? వారేం చేయాలనుకుంటున్నారు..? ఏం చేస్తే బాగుంటుంది..? ఇలా యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘యూత్‌ పార్లమెంట్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల నెహ్రూ యువ కేంద్రం(ఎన్‌వైకే) ప్రాంతీయ స్థాయిలో పోటీలు నిర్వహించగా  ఉమ్మడి జిల్లాల నుంచి రాష్ట్రస్థాయికి నలుగురు అర్హత సాధించారు. వారేం అన్నారో తెలుసుకుందామా..

ఎంపిక ఇలా..

జిల్లాల వారీగా ఎంపిక చేసిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి పంపించి పార్లమెంట్‌ భవన్‌లో ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది మార్పుల్లో భాగంగా సుమారు ఆరు నుంచి ఏడు జిల్లాల వారిని ప్రాంతీయ విభాగంగా ఏర్పాటు చేశారు. గత నెల 27న విజయనగరం శాఖకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇందులో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 70 మందికి వర్చువల్‌ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల నుంచి నలుగురు రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. ఆ పోటీల వేదిక, నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.


వైద్య వృత్తిని అభ్యసిస్తూ

నగరానికి చెందిన      సాయి స్వరూప్‌ మిమ్స్‌లో వైద్య వృత్తిని అభ్యసిస్తున్నారు.  2021లో జిల్లాస్థాయిలో జరిగిన యూత్‌ పార్లమెంట్‌ పోటీల్లో అవకాశం రాకపోయినా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. గతేడాది వినియోగదారుల హక్కుల  దినోత్సవం వేళ జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయం, ఆంధ్రా మెడికల్‌ కళాశాల వార్షికోత్సవం నాడు నిర్వహించిన చర్చలో ద్వితీయ స్థానాన్ని పొందారు. 2022లో ఎన్‌వైకే తలపెట్టిన యూత్‌ ఫెస్టివల్‌లో కూడా ‘దేశభక్తి..యువత’ అనే అంశంపై ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు.


బీ-టెక్‌ చదువుతూ..

ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీ-టెక్‌ చదువుతున్న ఎన్‌.అనూష తొలి ప్రయత్నంలోనే ప్రతిభ చూపింది. తల్లి గృహిణి కాగా.. తండ్రి వ్యాపారవేత్త. వేదికపై మాట్లాడేందుకు తొలుత భయం.. బెరుకు.. సిగ్గు ఉండేదని, నెమ్మదిగా వాటి నుంచి బయటపడాలంటే ఇటువంటి వేదికలను వినియోగించుకోవాలని తెలిసిందని అనూష చెబుతోంది. గతేడాది రఘు ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన యూత్‌ ఫెస్టివల్‌లో ‘దేశభక్తి.. యువత’ అనే అంశంపై మాట్లాడి అందరి మెప్పూ పొందింది.


మేఘన ప్రతిభ..

గరివిడిలోని పశు వైద్య కళాశాలలో వెటర్నరీ కోర్సు చదువుతున్న ఎస్‌.ముత్య మేఘన ఎన్‌సీఎస్‌ సమీపాన ఉంటున్నారు. తండ్రి రాకోడు పీహెచ్‌సీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి ఇంటి బాధ్యతలు చూస్తున్నారు. గతేడాది ఉన్నత విద్యా మండలి నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీల్లో ఆమె సెమీ ఫైనల్‌ వరకూ వెళ్లింది. జిల్లా స్థాయిలో చక్కని ప్రసంగంతో రాష్ట్రస్థాయికి ఎంపికైన తన కు మరోమారు ప్రతిభను నిరూపించుకునే అవకాశం కలిగిందని పేర్కొంటోంది.


ఇందూ నైపుణ్యం..

నగరంలోని ఎ.శ్రీదేవి, ఆనంద ప్రసాద్‌ దంపతుల కుమార్తె ఇందు జాహ్నవి ప్రస్తుతం బీ-టెక్‌ చదువుతోంది. గతంలో పలుసార్లు కళాశాల వేదిక మీద వివిధ అంశాలపై ప్రసంగించిన అనుభవంతో ఆమె దూసుకుపోతోంది. తండ్రి మెడికల్‌ రంగంలో ఉండగా.. తల్లి గృహిణి. పైడితల్లి ఉత్సవాల కార్యక్రమానికి యాంకర్‌గా కూడా పనిచేశానని, అది తనకు ఎంతో ఉపయోగపడిందంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని