logo

రక్తదాతలూ.. మీరే ప్రాణాలు నిలపాలి

ఊహించని ప్రమాదాలు.. అత్యవసర పరిస్థితుల్లో.. వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో వేసవి కారణంగా నిల్వలు అడుగంటుతున్నాయి.

Published : 03 Jun 2023 03:25 IST

జిల్లాలో గణనీయంగా తగ్గిన నిల్వలు
న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం, పాలకొండ, సాలూరు

కొమరాడ మండలం పెద్దశాఖకి చెందిన గర్భిణి సరస్వతిని ఇటీవల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఏబీ-పాజిటివ్‌ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు. దాత కోసం ఇబ్బందులు పడగా సదరు కుటుంబీకులు చివరికి రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యుల సాయంతో దాతను కనుగొన్నారు. వేసవి, ఎండతాపంతో దాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


పార్వతీపురం మండలానికి చెందిన గర్భిణి రేవతి రెండ్రోజుల కిందట జిల్లా ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారు. ఒ-పాజిటివ్‌ రక్తం అవసరమని, దాతను తీసుకొని రావాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. తెలిసిన వారెవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు దాత వారణాసి వెంకటరమణను సంప్రదించగా ఇచ్చారు. ఇతను 99వ సారి రక్తదానం చేశారు.

హించని ప్రమాదాలు.. అత్యవసర పరిస్థితుల్లో.. వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్న రక్తనిధి కేంద్రాల్లో వేసవి కారణంగా నిల్వలు అడుగంటుతున్నాయి. అరుదైన రక్తం కావాలంటే దాతల కోసం వెతుకులాట తప్పడం లేదు. విపరీతమైన ఎండలతో దాతలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు దానానికి ముందుకు రావడం లేదు. 300 యూనిట్లు నిల్వ చేసే శీతల పరికరంలో 55 యూనిట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందంటే కొరత తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పాలకొండ, సాలూరు, సీతంపేట ప్రాంతీయాసుపత్రుల్లో సరఫరా కేంద్రాలున్నాయి. ఆయా చోట్ల 60 యూనిట్ల చొప్పున నిల్వచేసే అవకాశం ఉన్నా.. రెండు, మూడు యూనిట్లు మాత్రమే ఉన్నాయి.  

పార్వతీపురం మన్యంలో ఒక జిల్లా ఆసుపత్రి, మూడు ప్రాంతీయాసుపత్రులు, మూడు సీహెచ్‌సీలు, 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఏటా 240 వరకు వివిధ రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 1,200 మంది గాయపడుతున్నారు. వీరిలో సుమారు 700 మందికి రక్తం అవసరం అవుతోంది. ఏటా జరిగే 12,000 ప్రసవాల్లో ఆరేడు వేల మందికి రక్తం కావాలి. అలాగే తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, రక్తహీనతతో బాధపడే వారికీ ఉండాలి.  వీళ్లందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రక్తనిధి, సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్నారు. ఏటా 8,000 యూనిట్ల రక్తం అవసరం కాగా.. సేకరణ 3,000 మాత్రమే ఉంది. జిల్లాలో రోజుకు 8 నుంచి 10 యూనిట్ల రక్తం అవసరం అవుతోంది. సాలూరు, సీతంపేట, పాలకొండ ప్రాంతీయాసుపత్రుల్లో నాలుగైదు యూనిట్లు, కురుపాం, చినమేరంగిలో రెండు యూనిట్ల చొప్పున అవసరం. ఈ లెక్కన నెలకు 600 యూనిట్లకి పైగా ఉండాలి.  


ఇందులోనూ చూసుకోవచ్చు: రక్తనిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి...? ఏ బ్లడ్‌ బ్యాంకులో ఉన్నాయి..? ఎలా సద్వినియోగం చేసుకోవాలి..? తదితర వివరాలు తెలుసుకునేందుకు ’ e-rakthakosh అనే వెబ్‌సైట్‌, యాప్‌ పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్లడ్‌ బ్యాంకుల వివరాలు ఇందులో నమోదై ఉంటాయని వైద్యఆరోగ్య శాఖ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.


కొవిడ్‌ ప్రభావం

రోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పోస్టు కొవిడ్‌ ప్రభావంతో చాలా మంది ఇప్పటికీ పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల రక్తదానానికి ముందుకు రావడం లేదు. శరీరంలో శక్తి తగ్గడం వల్ల.. రక్తమిస్తే నీరసంగా అవుతామనే అపోహ ఉంది. ఆయాసం, బరువు తగ్గడం, తరచూ జ్వరాల బారినపడటం వంటి రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఇవ్వలేకున్నామని  దాతలు చెబుతున్నారు. కొవిడ్‌కి ముందు జిల్లాలో ఏడాదికి 70- 100 రక్తదాన శిబిరాలు జరిగేవి. తర్వాత ఆ సంఖ్య 40-50కు చేరింది. దీనికి తోడు వేసవిలో కళాశాలలు, విద్యాసంస్థలు మూతపడటంతో శిబిరాలకు ఆస్కారం లేకుండా పోయింది.  


రక్తం అవసరమైతే రండి

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే విజయనగరం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులో అందుబాటులో ఉందని ఆ సంస్థ ఛైర్మన్‌ కేఆర్‌డీ ప్రసాదరావు, కార్యదర్శి కె.సత్యం శుక్రవారం తెలిపారు. ఏ-పాజిటివ్‌ 30, బి-పాజిటివ్‌ 32, ఓ-పాజిటివ్‌ 54, ఏబీ పాజిటివ్‌-01, బి-నెగిటివ్‌ 1 ప్యాకెట్లు ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


అవగాహన పెంచుతున్నాం

- వాగ్దేవి, డీసీహెచ్‌ఎస్‌, పార్వతీపురం

వేసవిలో రక్తదానం చేయకూడదన్నది కేవలం అపోహ. రక్తదాతలు ముందుకొస్తే వారికి ఇబ్బందులు రాకుండా సురక్షితంగా రక్తం సేకరిస్తాం. స్వచ్ఛంద సంస్థలు, హీరోల అభిమాన సంఘాలను సంప్రదిస్తున్నాం. వేసవి కావడంతో యువత సాకార శిబిరాలకు అవకాశం తగ్గింది. ఆపదలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని దాతలు స్పందించాలి. అరుదైన గ్రూపు రక్తం ఉన్నవారి చరవాణి నంబర్లు సేకరించాం. అత్యవసర సమయాల్లో వారిని సంప్రదిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని