logo

ఆపద్బాంధవులకూ కష్టాలే!!

అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది.

Published : 28 Mar 2024 04:12 IST

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే

జిల్లా అధికారి విధులు నిర్వహిస్తున్న పాత కేంద్రం

అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. అరకొర సౌకర్యాల నడుమే విధులు నిర్వహిస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.

బిల్లుల విడుదలలో జాప్యం..

జిల్లా కేంద్రంలో ఉన్న విభాగాన్ని డబుల్‌ ఇంజిన్‌ స్టేషన్‌ అంటారు. ఇక్కడ ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారు. జిల్లా అధికారితో పాటు, సహాయ అధికారి కూడా ఉంటారు. 24 గంటలూ అందుబాటులో ఉండాల్సి రావడంతో  విశ్రాంతి గదులు అవసరం. అవన్నీ ఏళ్ల నాటివి కావడంతో వారి కష్టాలను గుర్తించిన గత ప్రభుత్వం రూ.1.20 కోట్లతో కొత్తస్టేషన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. గుత్తేదారుడు బిల్లులు రాలేదని పలుమార్లు న్యాయస్థానానికి వెళ్లి పోరాడాల్సి వచ్చింది. నేటికీ ఆ భవనం అందుబాటులోకి రాలేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

తప్పని కొరత..: పదేళ్ల కిందట సమకూర్చిన సామగ్రి, వాహనాలనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రెండు ఫైరింజన్లతో పాటు మిస్ట్‌ జీపు, మిస్ట్‌ బుల్లెట్‌, మినీ వ్యాన్‌లున్నాయి. మిగిలిన ఏడు స్టేషన్లలో ఒక్కో వాహనమే ఉంది. అగ్నిమాపక సహాయ అధికారులు, లీడింగ్‌ ఫైర్‌మెన్లు, పైలెట్ల కొరత వేధిస్తోంది. ఒక్కో స్టేషన్‌లో ముగ్గురు పైలెట్లకు ప్రస్తుతం ఇద్దరు చొప్పన ఉన్నారు. జిల్లా కేంద్రంలో మరొకరు అవసరం. ప్రమాదాల నియంత్రలో కీలకమైన స్కై లిఫ్ట్‌ నేటికీ సమకూరలేదు.

సగం పాతవే..

జిల్లాలో విజయనగరంతో పాటు చీపురుపల్లి, ఎస్‌.కోట, కొత్తవలస, గజపతినగరం, రాజాం, బొబ్బిలి, బాడంగిలో కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో మూడు తప్ప మిగిలిన వన్నీ పాత భవనాలే. ఇప్పటికే శిథిలావస్థకు చేరడంతో అధికారులే సొంత నిధులు వెచ్చిస్తూ మరమ్మతులు చేసుకుంటున్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేంద్రమే ఏర్పాటు కాలేదు. కోనాడ వద్ద స్థలం కేటాయించారని చెబుతున్నా కలగానే మిగిలిపోతోంది.

చెరువుల మీదే ఆధారం..

మంటలు ఆర్పేందుకు నీళ్లు అవసరం. ఏటా వేసవిలో ఇబ్బందులు తప్పడం లేదు. చెరువులే దిక్కవుతున్నాయి. నిధులు లేకపోవడంతో స్టేషన్ల ప్రాంగణంలో బావులు, మోటార్ల ఏర్పాటు అటకెక్కింది. దీంతో నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్నిసార్లు ఆలస్యం కావడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి రామ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని