logo

లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!

ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది.

Published : 28 Mar 2024 04:31 IST

రాళ్లు తేలిన రహదారి

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. కాలనీలో వందలాది ఇంటి స్థలాలు ఇచ్చినా నేటికీ నిర్మాణాలు మాత్రం పూర్తికాలేదు.

పాలకొండలోని లుంబూరు పంచాయతీ పరిధిలో గరుగుబిల్లి గ్రామ సమీపంలో పంట పొలాలను కొనుగోలు చేసి లేఅవుటు ఏర్పాటు చేశారు. ఇక్కడ 1,300 మంది వరకు లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించారు. ఒక్కొక్కరికీ సెంటు చొప్పున స్థలాలు ఇచ్చారు. ఈ కాలనీకి చేరుకోవాలంటే పాలకొండ నుంచి రెండు కి.మీ. వెళ్లాల్సిందే. గాసివీధి నుంచి లేఅవుట్‌ వరకు రహదారులు రాళ్లు తేలి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

కానరాని తాగునీరు

వందలాది మంది లబ్ధిదారులకు ఇచ్చిన లేఅవుట్‌లో తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉండడంతో తాగునీరు తెచ్చుకునేందుకు వీలులేకుండా ఉంది. ఈ కారణంగా చాలా మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారంతా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జలజీవన్‌ మిషన్‌లో భాగంగా రూ.3 కోట్లు నిధులు మంజూరైనా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

నిర్మాణానికి నీరేదీ

లేఅవుట్‌ ఉన్న ప్రాంతంలో నీటి సదుపాయం లేక నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించడం లేదు. దీంతో అధికారులు లుంబూరు గెడ్డ నుంచి పైపుల ద్వారా నీరందించేందుకు 30 వరకు సంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.80 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో గెడ్డలో నీరు లేక నిర్మాణాలకు అందడం లేదు. నిర్మించిన సంపులు సైతం పలు చోట్ల శిథిలమయ్యాయి.

ఇంటింటి కుళాయిలు వేసేందుకు తెచ్చిన పైపులుస

అంతర్గత రహదారులూ అంతే

కాలనీలో ప్రధాన రహదారితో పాటు 22 వరకు అంతర్గత రహదారులు ఉన్నాయి. అన్నింటా గ్రావెల్‌ రోడ్లు నిర్మించారు. ఇందుకోసం రూ.60 లక్షల వరకు వ్యయం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా ఈ రహదారులు బురదమయంగా మారి ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.  

వీధి కాలువలేవీ

అత్యంత విశాలమైన ప్రాంతంలో లేఅవుట్‌ ఉంది. తాత్కాలికంగా గ్రావెల్‌ రహదారులు నిర్మించినా కాలువల నిర్మాణం చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా వీధుల్లో నీరు పోయేందుకు మార్గం లేకుండా పోయింది. ఖాళీ స్థలాల్లో నీరు నిలిచిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని