logo

వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్‌లో ఉంచేశారు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు.

Published : 20 Apr 2024 03:55 IST

వైకాపా అభ్యర్థుల నామినేషన్లలో అడుగడుగునా అవస్థలు

పాలకొండ, గ్రామీణం, సీతంపేట, పార్వతీపురం, కురుపాం గ్రామీణం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. వాహనాల్లో పెద్దఎత్తున ఎక్కించి, నియోజకవర్గ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కురుపాం, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు వైకాపా అభ్యర్థులు పుష్పశ్రీవాణి, కళావతి నామినేషన్లు వేశారు. ఈ సమయంలో ఇష్టానుసారంగా వాహనాలు తీసుకురావడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వాహనాల్లో కార్యకర్తలను తీసుకురావడంతో సీతంపేటలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సుమారు రెండు గంటల పాటు మండుటెండలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలకొండ వైపు వెళ్తున్న 108 అంబులెన్స్‌ వాహనాల మధ్య చిక్కుకుంది. బందోబస్తులో ఉన్న పోలీసులు చేరుకొని సరిచేశారు. కళావతి నామినేషన్‌ పూర్తికాకముందే పార్టీ కార్యకర్తలు జెండాలతో మద్యం దుకాణాలకు చేరుకొని హడావుడి చేశారు.

కురుపాంలో ఇలా..

కురుపాంలో నాలుగు నియోజకవర్గ కార్యకర్తలు హంగామా చేశారు. మద్యం దుకాణాలు వద్ద పార్టీ జెండాలు, టోపీలు ధరించి బారులు తీరారు. ఇక్కడ మార్కెట్‌ రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతో వాహనం వెళ్లాలంటేనే ఇబ్బందులు పడాలి. అలాంటిది ర్యాలీగా రావడంతో గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్లే వాహనాల అరగంట పాటు నిలిచిపోయాయి. జడ్పీ ఉపాధ్యక్షుడు బాపూజీనాయుడు ఆర్వో కార్యాలయం లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆంక్షలు విధించారు. అభ్యర్థి నామినేషన్‌ వేసే సమయంలో నాయకులు కనిపించకపోవడంతో వారితో వచ్చిన ప్రజలు ఎండ వేడి తట్టుకోలేక చెట్ల కిందకు చేరుకున్నారు.  

ఉద్యోగినులకు ఇబ్బందులు..

పార్వతీపురం కలెక్టరేట్‌లో నామపత్రాలు స్వీకరించారు. ఇక్కడ 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని చెప్పినా, ప్రధాన ద్వారంలో వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతోపాటు కార్యాలయాలకు పనిమీద వచ్చే వారినీ లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో వారు నిరాశగా వెనుతిరిగారు. ఆర్‌ఐని కలిసేందుకు వచ్చిన వృద్ధ దంపతులు ఎండలో తిరిగి వెళ్లిపోయారు.  

బొబ్బిలి, న్యూస్‌టుడే: వైకాపా అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనాలను ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చారు. పట్టణ నలువైపులా ఆటోలు బారులు తీరడం, కొంతమంది రహదారుల చెంతే ఆపేయడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడి, సాధారణ ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. చీపురుపల్లి వీధిలోని పార్టీ కార్యాలయానికి కొందరు ఆటోల్లో చేరుకోవడంతో గాంధీబొమ్మ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడ్డారు. అక్కడి నుంచి శంబంగి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని, వెళ్లారు. ఆపై ఓపెన్‌టాప్‌ వాహనంలో ర్యాలీగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఫ్లై ఓవర్‌ వద్దకు చేరుకుని, మాట్లాడారు. వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో అరగంట సేపు వాహనాలు బారులుతీరి, కదల్లేదు. పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఆర్టీసీ కాంప్లెక్సు కూడలిలో కూడా కొంత సమయం ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో అత్యవసర పనులకు వెళ్లే జనం అవస్థలు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు