logo

వెన్నుదన్నుగా వ్యవసాయ సలహా మండలి

జిల్లాలోని రైతులకు వ్యవసాయ సలహా మండలి వెన్నుదన్నుగా ఉండాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రకాశం భవన్‌లో శుక్రవారం సలహా మండలి సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ స్థానిక

Published : 22 Jan 2022 04:26 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట

శ్రీనివాసులురెడ్డి, చిత్రంలో జేసీ వెంకట మురళి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని రైతులకు వ్యవసాయ సలహా మండలి వెన్నుదన్నుగా ఉండాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రకాశం భవన్‌లో శుక్రవారం సలహా మండలి సమావేశం జరిగింది. ఎంపీ మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ స్థానిక పరిస్థితులను గమనించి మండలి ద్వారా రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సంయుక్త కలెక్టర్‌ వెంకట మురళి మాట్లాడుతూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై లబ్ధిదారులే ఇతర రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, అందిస్తున్న రాయితీలను వినియోగించుకునేలా రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వివరించాలన్నారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు, వ్యాధుల బారిన పడుతున్న పశువులకు నష్టపరిహారం అందించేలా ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఒకేసారి మూడు పశువులు చనిపోతేనే పరిహారం మంజూరు చేయాలన్న నిబంధనను సడలించాలన్నారు. ఒక పశువు చనిపోయినా ఆ రైతును ప్రభుత్వం ఆదుకునేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి, జేడీఏ శ్రీనివాసరావు, పశు సంవర్ధకశాఖ జేడీ బేబిరాణి, డ్వామా పీడీ శీనారెడ్డి, పౌర సరఫరాల సంస్థ డీఎం నారదముని, ఎల్‌డీఎం యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని