logo

ప్రైవేటు భూముల్లో స్మార్ట్‌ సిటీ

రాష్ట్రంలోని మధ్యస్థ ఆదాయం కలిగిన ప్రజలకు(ఎంఐజీ) లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న స్మార్ట్‌ సిటీ’ పథకానికి సంబంధించి తాజాగా మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రకాశం

Published : 22 Jan 2022 04:26 IST

మూడు స్థలాలు ప్రతిపాదించిన అధికారులు

ఎంఐజీ ప్లాట్ల కోసం వచ్చిన దరఖాస్తులు 9 వేలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని మధ్యస్థ ఆదాయం కలిగిన ప్రజలకు(ఎంఐజీ) లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న స్మార్ట్‌ సిటీ’ పథకానికి సంబంధించి తాజాగా మూడు చోట్ల స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలో ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అన్ని పట్టణాల్లో మధ్య తరగతి కుటుంబాల కోసం ఈ పథకం ప్రవేశపెట్టారు. రెండు నెలల క్రితం అర్హులైన వారు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరగా ఒక్క ఒంగోలు నగరంలో 9 వేలకు పైగా దరఖాస్తులందాయి.

300 ఎకరాలు అవసరం...

వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడానికి సుమారు 300 ఎకరాలు స్థలం అవసరం అవుతుందని అంచనా వేశారు. దశల వారీగా స్థలాలు కొనుగోలు చేసి లేఅవుట్లు వేయనున్నారు. తొలిదశలో వంద ఎకరాలు సిద్ధం చేయాలని యోచిస్తున్నారు. ఇటీవల జాయింట్‌ కలెక్టర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పెళ్లూరు-నర్సాపురం అగ్రహారం రోడ్డులో వంద ఎకరాలు, వెంగముక్కలపాలెం రోడ్డులోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పక్కన వంద, యరజర్ల రోడ్డులో వంద ఎకరాలను ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే స్థల యజమానులతో మాట్లాడి ధర నిర్ణయిస్తారు.

లబ్ధిదారులు 10 శాతం చెల్లించాలి...

ఎంఐజీ ఇంటి స్థలాల లబ్ధిదారులు ముందుగా 10 శాతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత ధరను బట్టి విడతల వారీగా మిగిలినది చెల్లిస్తారు. నగర నివాసులై ఉండి వార్షికాదాయం రూ.3 లక్షలు పైన ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తులు పరిశీలించాక అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ పథకానికి ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించారు. లేఅవుట్‌లో ముందుగా రోడ్లు, విద్యుత్తు, కాలువలు, పాఠశాల, పార్కులాంటి ప్రజాఅవసరాలకు కేటాయించిన స్థలాన్ని అభివృద్ధి చేయడం లాంటి పనులు చేపడతారు. అది పూర్తయ్యాకనే కేటాయింపులు జరుగుతాయి.

పాత పథకంపై దృష్టి...

1988లో ఇలాంటి పథకమే ఐడీఎస్‌ఎంటీ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసింది. అప్పట్లో నగరంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ ఎదుట కొండపక్కన ఉన్న స్థలంలో మూడు కేటగిరీల వారికి ప్లాట్లు కేటాయించారు. బహిరంగ వేలం ద్వారా ప్లాట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలో మొత్తం 416 ప్లాట్లు సిద్ధం చేశారు. అయితే 74 ప్లాట్లు ఇప్పటికీ మిగిలిపోయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు వేలం ద్వారా కేటాయించడానికి నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. రిజర్వేషన్‌ కేటగిరీకి అవి కేటాయించాల్సి ఉంది. ఇవి వేలం వేస్తే నగరపాలక సంస్థకు రూ.13 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. త్వరలో ఈ అంశాన్ని పాలకవర్గ సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని