logo

ప్రైవేట్ పరీక్షల్లో బాదుడు

కొవిడ్‌ నిర్ధారణకు చేపట్టే ప్రైవేట్‌ పరీక్షలపై నియంత్రణ లోపించింది. దీంతో కొందరు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. మొదటి, రెండు దశల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం.. మరణాలు సంభవించాయి. దీంతో మూడో దశలో పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Published : 25 Jan 2022 03:28 IST

 మూడుచోట్లే ప్రభుత్వ ల్యాబ్‌లు 
 ముప్పు తెస్తున్న అనధికారిక కేసులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కొవిడ్‌ నిర్ధారణకు చేపట్టే ప్రైవేట్‌ పరీక్షలపై నియంత్రణ లోపించింది. దీంతో కొందరు ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. మొదటి, రెండు దశల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం.. మరణాలు సంభవించాయి. దీంతో మూడో దశలో పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో జిల్లా మొత్తానికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఒక్క జీజీహెచ్‌లోనే నిర్వహించేవారు. ఫలితంగా ఫలితాల్లో జాప్యం చోటుచేసుకునేది. కొన్ని రోజులు ర్యాపిడ్, ట్రూనాట్‌ పరీక్షలు కూడా చేపట్టారు. వాటిలో వ్యాధి నిర్ధారణ స్పష్టత లేకపోవడంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష మాత్రమే చేయాలని ఆదేశాలిచ్చారు. మూడో దశలో ఎక్కువ కేసులు వస్తాయని భావించి అదనంగా మార్కాపురం, కందుకూరులోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ప్రైవేట్‌గా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు కొన్ని ల్యాబ్‌లకూ అనుమతి ఇచ్చారు.
ఇష్టానుసారం వసూలు...
ప్రైవేట్‌గా ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.350కు మించి వసూలు చేయకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. దీనిపై నిఘా లేకుండా పోయింది. విదేశాలకు వెళ్లే వారికి 24 గంటల ముందు చేయించుకున్న పరీక్ష నెగెటివ్‌ అని నివేదిక ఉండాలి. అది కూడా క్యూఆర్‌ కోడ్‌తో ఉన్నది అవసరం. జీజీహెచ్‌లో ఆ సౌకర్యం లేదు. దీంతో విదేశాలకు వెళ్లేవారు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ రూ.1000 నుంచి రూ. 1200 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిన వారి జాబితాను ఆ ప్రాంత ఏఎన్‌ఎంలకు పంపి వారం రోజులపాటు ఆరోగ్య పరిస్థితిని రోజూ వాకబు చేస్తారు. తనకు పాజిటివ్‌ వచ్చినట్టు ఇతరులకు తెలియకుండా గోప్యంగా ఉండాలని కోరుకునేవారు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లి అడిగిన చెల్లించి పరీక్షలు చేయించుకుంటున్నారు. 
లక్షణాలున్నా.. గోప్యంగా...: కొందరు తమకు కొవిడ్‌ లక్షణాలున్నా పరీక్షల జోలికి వెళ్లకుండా ఆర్‌ఎంపీలు, దుకాణాల్లో మందులు తీసుకొని వాడుకుంటున్నారు. ఈ తరహా ధోరణి వల్ల ప్రభుత్వం ప్రకటించే రోజువారీ పాజిటివ్‌ లెక్కలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. వ్యాధిసోకిన వారు వ్యక్తిగత దైనందిన అవసరాల కోసం బయట తిరుగుతున్నారు. ఫలితంగా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. 
ఎక్కువ వసూలు చేస్తే చర్యలు...
ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు ప్రైవేట్‌గా రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు, కొన్ని ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చాం. పరీక్షకు రూ.350 మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు. 
- డాక్టర్‌ పి.రత్నావళి, డీఎంహెచ్‌వో 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని