logo

వ్యతిరేక వర్గమైనందునే కేసులతో వేధింపులు

ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంలో ఉన్నందున తనపై అక్రమంగా కేసు బనాయించి వేధిస్తున్నారని వైకాపా నాయకుడు ఒంటేరు మల్లికార్జున యాదవ్‌ ఆరోపించారు. మరి కొందరు నాయకులతో కలిసి దర్శి పోలీసు స్టేషన్‌ ఎదుట... నల్ల రిబ్బన్లు ధరించి సోమవారం

Published : 24 May 2022 02:20 IST

దర్శిలో వైకాపా నాయకుల నిరసన

స్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న మల్లికార్జున యాదవ్‌, ఇతర నాయకులు

దర్శి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంలో ఉన్నందున తనపై అక్రమంగా కేసు బనాయించి వేధిస్తున్నారని వైకాపా నాయకుడు ఒంటేరు మల్లికార్జున యాదవ్‌ ఆరోపించారు. మరి కొందరు నాయకులతో కలిసి దర్శి పోలీసు స్టేషన్‌ ఎదుట... నల్ల రిబ్బన్లు ధరించి సోమవారం నిరసన చేపట్టారు. ఒంగోలు పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఓ రకంగా అన్న మాటలను మరో విధంగా మార్చి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని... వేమిరెడ్డి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లికార్జున సహా ముగ్గురిపై ఆదివారం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో ఆయన స్టేషన్‌కు వచ్చారు. మిగిలిన ఇద్దరినీ కాదని తనను మాత్రమే పిలవడంపై ప్రశ్నించారు. వచ్చిన ఫిర్యాదుపై నిజానిజాలు తెలుసుకోకుండా కేసు నమోదు చేశారని ఆరోపించారు. తనపై ఫిర్యాదు చేసిన చెన్నారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంలో ఉండడం వల్లే కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని... ఆ వర్గం నాయకులు విమర్శించారు. ఇది పార్టీకి మంచిది కాదని... ఇప్పటికైనా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. నిరసన తెలిపిన వారిలో షేక్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బాషా, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

ఉపసంహరించకుంటే ఉద్యమం: జనసేన

ఇదే విషయంలో ఎలాంటి సంబంధం లేని జనసేన నాయకులపై కేసులు పెట్టడం దారుణమని ఆ పార్టీ జిల్లా లీగల్‌ సెల్‌ కార్యదర్శి వరికూటి నాగరాజు పేర్కొన్నారు. పొదిలి రోడ్డులో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని అరబ్‌ దేశంలో ఉంటున్న ఆయూబ్‌, జిల్లా నాయకుడు కల్యాణ్‌పై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. వెంటనే కేసులు వెనక్కి తీసుకోని పక్షంలో... పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో పాటు, న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ తరహా వ్యవహారాల్లో కోర్టులు పలుమార్లు మొట్టికాయలు వేసినా... ప్రభుత్వ పద్ధతి మారడం లేదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు విడనాడాలని హితవు పలికారు. సమావేశంలో జగదీష్‌, లక్ష్మయ్య, శ్రీను, ఇర్షద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని