logo

మదిలో నిలిచిపోయేలా..!

ఒంగోలు సమీప మండువారిపాలెంలో శుక్ర, శనివారాల్లో జరిగే తెదేపా మహానాడుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా ఎటుచూసినా పసుపు వర్ణమే. ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలతో దారులన్నీ ప్రత్యేక శోభతో ఉట్టిపడుతున్నాయి.

Published : 26 May 2022 06:52 IST

మహా ప్రాంగణానికి తుది మెరుగులు

నగరమంతటా ప్రత్యేక అలంకరణలు

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సమాఖ్య మాజీ ఛైర్మన్‌

కోటేశ్వరరావుతో ముచ్చటిస్తున్న అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం: ఒంగోలు సమీప మండువారిపాలెంలో శుక్ర, శనివారాల్లో జరిగే తెదేపా మహానాడుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా ఎటుచూసినా పసుపు వర్ణమే. ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలతో దారులన్నీ ప్రత్యేక శోభతో ఉట్టిపడుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు నిత్యం మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కార్యక్రమ వివరాలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. మరో వైపు పార్టీ అగ్రనేతలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బుధవారం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, పి.మాణిక్యాలరావు, సయ్యద్‌ రఫీ, జిల్లా నేతలు దామచర్ల జనార్దన్‌, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పోతుల రామారావు, ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు. సభా ప్రాంగణమంతా ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని అచ్చెన్నాయుడు సూచించారు.

చంద్రబాబు రాక నేపథ్యంలో ..

మహానాడులో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారమే ఒంగోలు రానుండటంతో పార్టీ శ్రేణులన్నీ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైక్‌ ర్యాలీ ఉండనుంది..చిలకలూరిపేట, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు కూడా గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకల్లా తమ ద్విచక్ర వాహనాలతో త్రోవగుంట చేరుకోవాలని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పిలుపునిచ్చారు. స్థానిక మంగమూరురోడ్డు కూడలిలో చంద్రబాబుకు క్రేన్‌ సహాయంతో గజమాల వేసేలా ప్రణాళిక చేశారు. మధ్యాహ్నం త్రోవగుంట వద్దకు చంద్రబాబు వచ్చి అక్కడినుంచి పొలిట్‌బ్యూరో సమావేశం జరిగే సరోవర్‌ హోటల్‌కు చేరుకుంటారని నేతలు తెలిపారు. 3 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. ఎన్‌ఎస్‌పీ అతిథిగృహంలోనే బస చేయనున్న చంద్రబాబు 27, 28 తేదీల్లో మహానాడు ప్రాంగణానికి అక్కడినుంచే చేరుకోనున్నారు.

తోరణాల తొలగింపుపై మండిపడ్డ శ్రేణులు

చర్చిసెంటర్‌, ప్రకాశం భవన్‌ ఎదుట తెదేపా కట్టిన తోరణాలతో పాటు కొప్పోలు వద్ద డివైడర్‌పై ఫ్లెక్సీలను ఒంగోలు కార్పొరేషన్‌ సిబ్బంది ఉన్నఫళంగా తొలగించడంపై తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. అధికార పార్టీకి ఒక న్యాయం, తమకో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాయి. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ మహానాడు ఏర్పాట్లు చక్కగా చేస్తున్నామన్నారు. ఎక్కడా లోపం లేకుండా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా నగరంలో పసుపు తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. వాటిని తొలగించడమేమిటని ప్రశ్నించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు ఇబ్బందులు పెట్టలేదని, తాము ఇలానే చేసుంటే పాదయాత్ర చేసుండేవారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తుందన్నారు. అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని, ఇలా చిల్లర పనులు చేయడం సరికాదని.. కార్యాలయాలపై పడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేస్తామన్నారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున కౌంటర్ల ఏర్పాటు

మహానాడు విజయవంతానికి ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు


బుధవారం రాత్రి విద్యుత్తు వెలుగుల్లో మహానాడు ప్రాంగణం

ఏర్పాట్ల పరిశీలనలో మాజీ మంత్రి సోమిరెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల, దామచర్ల

కొప్పోలు వద్ద ఫ్లెక్సీ తొలగిస్తున్న నగర పాలక సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని