logo

తీరనున్న వన్యప్రాణుల దాహార్తి

నల్లమలలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రూ.20 లక్షలతో చెరువులు, కుంటల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌లు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌లను

Published : 27 Jun 2022 02:17 IST

అటవీశాఖ ప్రత్యేక చర్యలు
భూగర్భజలాల పెంపు లక్ష్యం

కుంటలో నిలిచిన నీటిని పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది

నల్లమలలో సంచరించే వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రూ.20 లక్షలతో చెరువులు, కుంటల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌లు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌లను నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాటిలో నీరు చేరాయి. వాటితో పాటు డీప్‌ బోర్ల నుంచి సోలార్‌ సిస్టం ద్వారా కుంటల్లో నీరు నింపారు. దీంతో వన్యప్రాణులకు దాహార్తి తీరనుంది.

న్యూస్‌టుడే, పెద్దదోర్నాల

చెరువులో పూడికతీత

పులిచెరువు, పెద్దారుట్ల, పోతురాజుకుంట, సట్టుతండా చెరువు, చిన్నమంతనాల చెరువు తదితర వాటిలో రూ.3 లక్షలతో పూడిక తీయించారు. వాటిలో వర్షం నీరు చేరాయి.

సోలార్‌ సిస్టం ద్వారా...

వర్షం కురవని ప్రాంతాల్లో డీప్‌ బోర్లు వేసి వాటిని సోలార్‌ సిస్టంతో కాలువలు, చెరువులు నింపుతున్నారు. చిన్నమంతనాల బీటు పరిధిలో మూడు డీప్‌ బోర్లు వేసి సోలార్‌ బిగించారు. అందు కోసం రూ.5 లక్షలు ఖర్చు చేశారు. అవి నిత్యం పని చేస్తుంటాయి. దీంతో చెరువుల్లో, కుంటల్లో నీరు ఉంటోంది.


డీప్‌బోరుకు ఏర్పాటు చేసిన సోలార్‌ సిస్టం

పులిచెరువులో....

పులులు ఎక్కువగా సంచరించే పులిచెరువులో నీరు నింపేందుకు గతంలో అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సంస్థ సంయుక్తంగా రూ.ఏడు లక్షలతో సోలార్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. అయితే సోలార్‌కు సంబంధించిన మోటార్‌ మరమ్మతులకు గురైంది. అది డెన్మార్క్‌ సంబంధించినది కావడం దానిని మరమ్మతులు చేసే సాంకేతిక నిపుణులు అందుబాటులో లేరు. దీంతో పాటు డీప్‌ బోరు నుంచి అవసరమైన నీరు రావడంలేదు. దీంతో అటవీశాఖ నూతనంగా రూ.లక్షతో డీప్‌ బోరు వేసి సోలార్‌ సిస్టంను మరమ్మతులు చేయిస్తున్నారు. త్వరలో దానిని బిగించినట్లు అటవీ అధికారులు తెలిపారు.


నీటితో నిండి కనిపిస్తున్న రాక్‌ఫిల్‌ డ్యామ్‌

చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం

చిన్నమంతనాల, చిలకచెర్ల బీట్ల పరిధిలో నాలుగు చెక్‌ డ్యామ్‌లు నిర్మించారు. వాటి కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు. చిలకచెర్ల బీట్‌లో రూ.లక్షతో ఏడు రాక్‌ఫిల్‌ డ్యామ్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో వర్షం నీరు నిల్వ ఉంది.


సద్వినియోగం చేసుకుంటాం

నల్లమల అటవీ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపొందించి ప్రత్యేక చర్యలు చేపట్టాం. చెక్‌ డ్యామ్‌లు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌లు, చెరువులు, కుంటలు పూడికతీత, సోలార్‌ సిస్టం ద్వారా నీటి కుంటలు నింపడం తదితర పనులు చేస్తున్నాం. వర్షం నీరు వృథా పోకుండా నిల్వ ఉంచుతున్నాం. ఈ చర్యల వల్ల వన్యప్రాణుల దాహార్తి తీరటంతోపాటు అటవీ ప్రాంతం కోతకు గురికాకుండా, సారవంతమైన మట్టి కొట్టుకొని పోకుండా ఉంటుంది.

- విశ్వేశ్వరరావు, రేంజర్‌, దోర్నాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని