logo

నగల కమీషన్‌ వ్యాపారి బ్యాగు చోరీ

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నగల కమీషన్‌ వ్యాపారి బ్యాగు చోరీకి గురైంది. రూ.లక్షల విలువైన నగల బ్యాగును బస్సు సీటుపైన పెట్టి నిద్రిస్తుండగా ఆ బ్యాగు తీసుకుని ఓ వ్యక్తి మార్గ మధ్యలో దిగిపోయాడు. 

Published : 14 Aug 2022 02:12 IST

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నగల కమీషన్‌ వ్యాపారి బ్యాగు చోరీకి గురైంది. రూ.లక్షల విలువైన నగల బ్యాగును బస్సు సీటుపైన పెట్టి నిద్రిస్తుండగా ఆ బ్యాగు తీసుకుని ఓ వ్యక్తి మార్గ మధ్యలో దిగిపోయాడు.  బాధితుడు తెలియజేసిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని టేకు తోటకు చెందిన కె.శ్రీనివాసరావు కొన్నేళ్లుగా నగల కమీషన్‌ వ్యాపారం చేస్తుంటారు. ప్రతి నెల కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి నగలు అమ్ముకొని వచ్చిన నగదులో తనకు రావాల్సిన కమీషన్‌తో జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 7న శ్రీనివాసరావు నగల వ్యాపారి సత్తిబాబు వద్ద 272 గ్రాముల బంగారంతో పాటు తన వద్ద ఉన్న ముక్కు పుడకలు తీసుకుని కర్ణాటకకు వెళ్లారు. 8వ తేదీన తన వద్ద ఉన్న 20 గ్రాముల బంగారం అమ్మి వ్యాపారి వద్ద నుంచి 20 గ్రాముల పాత బంగారం తీసుకున్నాడు. అదే రోజు తన వద్ద ఉన్న బంగారంలో మరో 10 గ్రాములు బంగారం అమ్మి రూ.50 వేలు నగదు తీసుకున్నారు. అనంతరం ఈ నెల 9న రాయచూర్‌లో విజయవాడ బస్సెక్కి తన వద్ద ఉన్న నగల బ్యాగును సీటు పైన పెట్టారు. దోర్నాల వచ్చే వరకు మేలుకుని ఉన్న శ్రీనివాసరావు అక్కడి నుంచి నిద్ర పోయారు. 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వినుకొండలో మెలకువ వచ్చి బ్యాగు కోసం చూడగా బస్సులో బ్యాగు లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బస్సు డ్రైవర్‌ను అడగ్గా ముగ్గురు వ్యక్తులు త్రిపురాంతకంలో దిగారని అందులో ఒకతను విజయవాడ టికెట్టు తీసుకున్నప్పటికీ బ్యాగు తీసుకుని త్రిపురాంతకంలో దిగాడని తెలిపారు. ఇక్కడెందుకు దిగావు అని డ్రైవర్‌ అడిగినప్పటికీ ఇక్కడ మా బంధువులు చనిపోవడంతో దిగుతున్నానని తెలిపాడని చెప్పారు.  దీంతో బాధితుడు కె.శ్రీనివాసరావు త్రిపురాంతకం పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై వెంకట సైదులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని