logo

అధికారం అండ.. ఇసుకాసురుల దందా

జిల్లాలో సహజ వనరులు ధ్వంసమవుతున్నాయి. అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వీరికి ‘అధికారం’ అభయహస్తం అందిస్తోంది. ఇసుక, మట్టిని కొల్లగొట్టి రోజూ వందలాది వాహనాల్లో తరలిస్తుండటంతో కొండలు, చెరువులు రూపుమారిపోతున్నాయి. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా

Updated : 30 Sep 2022 06:53 IST

‌ ఇష్టారాజ్యంగా దోపిడీ
‌ రూ. కోట్లలో ఆర్జిస్తున్న అక్రమార్కులు

పునుగోడు నుంచి కనిగిరికి ట్రాక్టరు ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఇసుక

జిల్లాలో సహజ వనరులు ధ్వంసమవుతున్నాయి. అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వీరికి ‘అధికారం’ అభయహస్తం అందిస్తోంది. ఇసుక, మట్టిని కొల్లగొట్టి రోజూ వందలాది వాహనాల్లో తరలిస్తుండటంతో కొండలు, చెరువులు రూపుమారిపోతున్నాయి. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా యంత్రాంగం నుంచి కట్టడి చర్యలు కానరావడం లేదు. కనిగిరి, పీసీపల్లి, దర్శి, సింగరాయకొండ ఇలా ఎక్కడచూసినా ఇదే పరిస్థితి.

రాత్రి వేళల్లో పట్టణం మీదుగా
కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమతి లేకుండా వాగులు, వంకలు, చెరువుల్లో ఇస్టానుసారంగా ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. తొలుత రహస్య ప్రదేశాల్లో డంప్‌ చేసి అక్కడి నుంచి ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ట్రాక్టరు ధర రూ.4 వేలకు పైగా ఉంది. మాకేరులో 10, అటవీభూముల్లో 4 ఎకరాలు, ఏరువారిపల్లి వాగులో 3 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అంతా జరుగుతుంది. ఎక్కువగా జగనన్న కాలనీల్లో ఇళ్ల పనులకు అమ్ముతున్నారు. రాత్రి వేళల్లో కనిగిరి పట్టణం మీదుగా ఇసుక వాహనాలు జోరుగా తిరుగుతుంటాయి. వీటి నుంచి కొందరు పోలీసులు కమీషన్లు తీసుకుంటున్నారు. సెబ్‌ సీఐ అబ్దుల్‌ జలీల్‌ మాట్లాడుతూ తాము నిఘా పెంచామని.. అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, కనిగిరి
 

ముద్దపాడులో అక్రమార్కులు నిల్వ చేసిన ఇసుక వద్ద రెవెన్యూ అధికారులు

అనుమతులు  వారికి వర్తించవంతే
పీసీపల్లి మండలంలోని పాలేటివాగు ఇసుకకు ఉన్న డిమాండ్‌ రీత్యా అక్రమార్కులు పాగా వేశారు. అయిదు గ్రామాల పొడుగునా లభ్యమవుతుండటంతో తవ్వకాలు చేపట్టి.. నిల్వ చేసి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుక రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ధర ఉంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముద్దపాడు పరిసరాల్లో గుట్టలుగా నిల్వలు ఉండటం చూసి కొందరు ఫిర్యాదు చేయడంతో బుధవారం రెవెన్యూ అధికారులు 42 ట్రాక్టర్ల ఇసుకను గుర్తించారు. మైనింగ్‌, సెబ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.


తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలం పరిధిలో ఎక్కడా ప్రభుత్వ ఇసుక రీచ్‌లు లేవన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే రెవెన్యూ, పోలీసులకు తెలియజేయాలని కోరారు.

ఏ ప్రాంతాన్నీ  వదలలేదు

లంకోజనపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 101, 102 లో కొండపోరంబోకు భూములున్నాయి. గతంలో స్థానికులకు సాగు కోసం కొన్ని భూములు ఇచ్చారు. కొందరు సాగు చేస్తుండగా మరికొందరు కొన్నాళ్లపాటు వ్యవసాయం చేసి వదిలేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల కన్ను ఈ స్థలాలపై పడింది. కబ్జా చేసి మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ ఉన్న ఎర్రమట్టి.. నిర్మాణాల సమయంలో మెరకకు వినియోగించడానికి అనువుగా ఉండటంతో యంత్రాల సాయంతో తవ్వి అమ్మకాలు చేస్తున్నారు. రోజూ 20 ట్రక్కుల ద్వారా మట్టి తరలుతోంది. ట్రక్కు ధర రూ.4,500 నుంచి రూ.5,000 .‌

‌* వెంకటాచలంపల్లి-కురిచేడు మార్గంలోని కొండ .. చందలూరు, చలివేంద్ర పరిధిలో పోతవరం వెళ్లే మార్గంలోనూ కొండలు ఎర్రమట్టి తవ్వకాలతో కరిగి పోయాయి. పోతవరం వద్ద ప్రస్తుతం ముమ్మరంగా 30-40 ట్రక్కుల ద్వారా తీసుకువెళ్తున్నారు.‌

‌* 50 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న చందలూరు చెరువు మట్టి తవ్వకాలతో గోతులమయంగా మారింది.

‌* మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని,  చర్యలు తీసుకుంటామని దర్శి తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

- న్యూస్‌టుడే, దర్శి

బీడు భూములే  కల్పతరువులు

సింగరాయకొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి 3500 ఎకరాల భూములున్నాయి. దాదాపు 1500 ఎకరాల వరకు ఆక్రమణకు గురికాగా మరికొన్ని ప్రాంతాల్లో కొందరు ఇళ్లు నిర్మించారు. ఖాళీగా ఉన్న బీడు భూముల్లో కొందరు ఎర్రమట్టి తవ్వి అమ్మేస్తున్నారు. దేవాలయం ఎదురుగా చెరువు పరిసర ప్రాంతాల్లో సర్వే నం 309లో 93 ఎకరాలు ఉన్నాయి. ఇందులోని 43 ఎకరాల్లో పేదలకు లేఅవుట్లను ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు అందించారు. మిగిలిన 50 ఎకరాలు పాతసింగరాయకొండ - ఊళ్లపాలెం గ్రామాల మధ్యలో ఉండటంతో నిత్యం అక్కడ నుంచి 400 టన్నుల ఎర్రమట్టిని ప్రైవేట్‌ లేఅవుట్లు, నూతన భవనాలు, స్థానిక రోడ్ల పనులకు తరలిస్తున్నారు. ‌్ర పాత సింగరాయకొండ ప్రాంతంలో 90 ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. ఇందులో 45 ఎకరాలకు కొందరు నకిలీ పట్టాలు సృష్టించేశారు. మిగిలిన 50 ఎకరాల్లో ఎర్రమట్టి ఉండటంతో యథేచ్ఛగా తవ్వి అమ్ముతున్నారు. అధికార పార్టీ నేతలు, రెవెన్యూ సిబ్బంది అండ బహిరంగ రహస్యమే.

- న్యూస్‌టుడే, టంగుటూరు, సింగరాయకొండ గ్రామీణం

ఇసుక తవ్వే ప్రాంతాలు:

కనిగిరి నాగుల చెరువు, జగనన్న కాలనీ సమీప అటవీ భూములు, ఏరువారిపల్లి వాగు, బొమ్మిరెడ్డిపల్లి వాగు, మాకేరు, యడవల్లి, యర్ర ఓబనపల్లి, చల్లగిరగల

నిత్యం తరలించే ట్రాక్టర్లు:100

ప్రాంతాలు:
దర్శి మండలం వెంకటాచలంపల్లి, చలివేంద్ర, చందలూరు, లంకోజనపల్లి పంచాయతీల పరిధిలోని చెరువులు, కొండ పోరంబోకు భూములు.
ప్రాంతాలు:
సింగరాయకొండ మండలం శానంపూడి, కనుమళ్ల, కలికివాయి, బింగినపల్లి, పాతసింగరాయకొండ, ఊళ్లపాలెం, సోమరాజుపల్లి, మూలగుంటపాడు.. లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు
ప్రాంతాలు:
పాలేటివాగు ఉన్న పాలేటిపల్లి, వాకంవారిపల్లి, ముద్దపాడు, బట్టుపల్లి, పెదఅలవలపాడు
రోజూ ఇసుక తీసుకువెళ్లే ట్రాక్టర్లు: 20-30

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని