logo

ఏకధాటిగా కుదిపేసింది

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలోని తీరప్రాంత మండలాలను జడిపించాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పడటంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఇటీవల ఎన్నడూలేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదైంది.

Updated : 02 Oct 2022 05:32 IST

ఒంగోలు, తీరప్రాంత మండలాల్లో భారీ వర్షం

మద్దిపాడులో ఏకంగా 110 మి.మీ.

జిల్లా కేంద్రంలో వాహనదారులకు నరకం

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు అర్బన్‌

ఒంగోలు డెయిరీ సమీపంలో వరద ప్రవాహంతో నిలిచిపోయిన వాహనాలు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలోని తీరప్రాంత మండలాలను జడిపించాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పడటంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఇటీవల ఎన్నడూలేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ప్రధాన రహదారులు మొదలు కాలనీల వరకు వాగులను తలపించాయి. కర్నూల్‌ రోడ్డయితే వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రవాహ ఉద్ధృతితో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాన నీటి పారుదలకు చేపట్టిన పనులు కొలిక్కిరాకపోవడం, ఆక్రమణలు వెరసి విపత్తుల వేళ ఒంగోలులో చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు పడిన వర్షాలతో ఒంగోలు, మద్దిపాడు, టంగుటూరు, సింగరాయకొండ ప్రాంతాలు వణికిపోయాయి. ఎటుచూసినా జల దిగ్బంధమే. ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, దుకాణాలలోకి నీళ్లు చేరి కార్లు, ద్విచక్రవాహనాలు మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు, వాన నీరు ఏకమైపోయాయి. నగరంలో ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కర్నూలు రోడ్డంతా వరదే. గుంటూరు రోడ్డుదీ అదే దుస్థితి. పోతురాజు కాలువకు ఇరువైపులా కాలనీలు జలంలో చిక్కుకున్నాయి. నాగులుప్పలపాడు మండంలోని కొత్తకోట వాగు పొంగి ప్రవహించడంతో వాహనాలు, ప్రజల రాకపోకలు గంటలకొద్దీ నిలిచాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం సాయంత్రం వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 14.1 మిల్లీమీటర్లు కాగా ఏకంగా 30 మి.మీ. నమోదైంది.

ఈ ఏడాదిలో అత్యధికంగా...

ఒంగోలు నగరంలో కురిసిన వర్షం ఈ ఏడాదిలోనే అత్యధికం. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8.30 వరకు 46.7 మి.మీ. పడగా శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 వరకు అత్యధికంగా 86.6 మి.మీ. కురిసింది. ఇక రాత్రి 10 గంటలకు పరిశీలిస్తే 108.75 మి.మీ. నమోదైంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు ఒంగోలు లోటు వర్షపాతంలోనే ఉండటం గమనార్హం. ఇక జిల్లాలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు, కురిచేడు, ముండ్లమూరు, దర్శి, అర్థవీడు, తాళ్లూరు, మద్దిపాడు, సంతనూతలపాడు, ఒంగోలు, పామూరు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 20- 55 మి.మీ. వర్షపాతం తక్కువే.  

ఒంగోలులోని అద్దంకి బస్టాండు కూడలి వద్ద..

పెరిగిన నీటిమట్టం

వర్షాలకు  మద్దిపాడులోని గుండ్లకమ్మ జలాశయంలో నీటిమట్టం పెరిగింది. దీని సామర్థ్యం 3.86 టీఎంసీలు కాగా గేట్ల మరమ్మతుల కారణంగా 1.7 టీఎంసీల వరకు నిల్వ ఉంచినప్పటికీ ప్రస్తుతం వస్తున్న వరదతో 1.85 టీఎంసీలకు చేరింది.

* రామతీర్థం జలాశయం నీటి సామర్థ్యం 1.57 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.17 టీఎంసీలు ఉంది.. మోపాడులో 1.49 టీఎంసీల నీరు కనిపించింది.

బాపూజీ కాంప్లెక్స్‌ సమీపంలో భారీ ప్రవాహం

కంట్రోల్‌ రూం.. టోల్‌ఫ్రీ 1077

ఒంగోలు గ్రామీణం: భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యల నిమిత్తం ఒంగోలులోని కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు చేశారు. టోల్‌ ఫ్రీ నం.1077ను అందుబాటులో ఉంచి.. 24 గంటలపాటు పనిచేసేలా సిబ్బందిని కేటాయించారు. కోస్తా తీర ప్రాంత మండలాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఒంగోలు నగరంలో తక్షణ సహాయ చర్యల నిమిత్తం డీఆర్వో ఓబులేసు...ఆర్డీవో విశ్వేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.  

అమ్మో.. కర్నూలు రోడ్డు

ఎడతెరపిలేని వర్షంతో కర్నూల్‌ రోడ్డు చెరువును తలపించింది. ప్రతిభ కళాశాల, డెయిరీ సమీపంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. పీర్లమాన్యం సమీపం నుంచి అటు పేర్నమిట్ట వరకు ఇదే పరిస్థితి. గంటల తరబడి వాహనాలు ఆగిపోయాయి. ఎక్కడికక్కడ లేఅవుట్లు వేసి ఆక్రమణలు, గోడల నిర్మాణాలు, చివరకు కాలువలనూ వదలకపోవడంతో నీరంతా ఈ ప్రధాన మార్గంపైకి చేరింది. ప్రతిభ కళాశాల ఎదురుగా ఉన్న వాగు ఆక్రమణల్లో ఉండటంతో ఎటు చూసినా జలమే. రహదారి విభాగినులను తొలగించి నీరు నిలవకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలోని పలు సంస్థల్లో సైతం భారీ ఎత్తున ప్రవాహం నిలిచింది. పీర్లమాన్యం వద్ద బస్సులు కదలకపోవడంతో ఎక్కువ మంది నడుచుకుంటూ ఒంగోలు చేరుకున్నారు. ఇక్కడ సైతం డివైడర్లను తొలగించారు. 39వ డివిజన్‌లో సగం రోడ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పీర్లమాన్యం సమీపంలో వరద పోయేందుకు విభాగిని తొలగింపు

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని