logo

ధర పెరగలేదు.. మీసం తిప్పలేదు

ప్రతికూల పరిస్థితులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రొయ్య రైతు .. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్న పరిస్థితి. మార్కెట్లో రెండు వారాలుగా ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రతి కౌంట్‌ మీద సరాసరిన కిలో రొయ్యల ధర రూ.50-60 చొప్పున పతనమైంది.

Published : 03 Oct 2022 02:21 IST

రెండు వారాల్లోనే కిలో వద్ద రూ.60 పతనం

ఆవేదనలో రొయ్య రైతులు

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణ

ప్రతికూల పరిస్థితులతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రొయ్య రైతు .. ఇప్పుడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్న పరిస్థితి. మార్కెట్లో రెండు వారాలుగా ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రతి కౌంట్‌ మీద సరాసరిన కిలో రొయ్యల ధర రూ.50-60 చొప్పున పతనమైంది. ఈ నెలలో ఎక్కువ విస్తీర్ణంలో పంట చేతికి రానుంది. అంతర్జాతీయంగా ఎగుమతులకు అనుమతి లేదన్న సాకుతో వ్యాపారులు సిండికేట్‌గా మారి తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎకరానికి రూ.లక్షపైగానే నష్టపోనున్నారు. రెండంకెల వృద్ధిలో భాగంగా ఆక్వా సాగు ద్వారా ప్రభుత్వానికి విదేశీ మారకద్రవ్యం రానుంది. ఈ నేపథ్యంలో స్థిరమైన మార్కెట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, నాగులుప్పలపాడు, సింగరాయకొండ మండలాల్లో సుమారు 10 వేల మంది రైతులు 18 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. 2020, 2021 సంవత్సరాల్లో కొవిడ్‌ ఆంక్షల వల్ల సరైన ఎగుమతులు లేక సాగుకు గిరాకీ తగ్గింది. అదే సమయంలో మేత ధరలు కూడా విడతల వారీగా కిలో రూ.20 పెరగడంతో సాగుదారులకు పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. రెండేళ్ల క్రితం కిలో ధర రూ.70 ఉండగా,  ప్రస్తుతం రూ.90. మేతలో సోయా సగ భాగం, మిగతా సగభాగం మొక్కజొన్న, మిశ్రమ లవణాలు వినియోగిస్తారు. సోయా టన్ను రూ.90 వేలు పలుకుతోందని అప్పట్లో మేత తయారీ కంపెనీలు ధరల పెంచాయి. ప్రస్తుతం అది రూ.50 వేలు ఉంది. అయినా కంపెనీలు ధర తగ్గించడంలేదు. వంద రోజుల పంట కాలానికి ఎకరా చెరువుకు మూడు టన్నుల మేత వినియోగిస్తారు. ఒక్క మేత ధరల పెంపు వల్ల రూ.60 వేల పెట్టుబడి అదనపు భారంగా మారుతోంది.

సరాసరి ఇలా నష్టం..

రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా చెరువులకు ఇచ్చే విద్యుత్తు రాయితీలో కోత విధించడంతో పంట ఉత్పత్తికి కూలీ ఖర్చులతో సహా ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. జూన్‌ నెల సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరా చెరువుకు 1.50 లక్షల రొయ్య పిల్లలను వదిలిపెట్టారు. వాతావరణ పరిస్థితులతో ప్రకాశం జిల్లాలో ఎక్కువ శాతం 70, 80 కౌంట్‌ మీదనే పంట చేతికి వస్తోంది. అందుకు కిలో రొయ్యకు రూ.300 చొప్పున ఖర్చవుతోంది. మార్కెట్‌లో ప్రస్తుతం కిలో ధర రూ.250 నుంచి రూ.270 పలుకుతోంది. పెట్టుబడి రూపంలోనే సరాసరిన కిలోకు రూ.30-50 నష్టపోతున్నారు.

టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామం వద్ద రొయ్యల సాగు

మళ్లీ టైగర్‌ వైపు..

జిల్లాలో ఖాళీగా ఉన్న 10 వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఆక్వా సాగు చేపట్టాలి. పదిహేనేళ్లకు ముందు టైగర్‌ రొయ్యలు వేసేవారు. ఆ తర్వాత వనామీ వేశారు. ఇటీవల దాంట్లోనూ నష్టాలు రావడంతో టైగర్‌ వైపు చూస్తున్నారు. మార్కెట్‌ సంక్షోభంలో ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుత సీజన్‌లో రొయ్యల సాగుకు రైతులు అయోమయంలో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని