logo

కారు దూసుకొచ్చి... ఒకరి దుర్మరణం

లారీ మరమ్మతుల నిమిత్తం రహదారి పక్కన నిల్చున్న వారిపైకి కారు దూసుకొచ్చిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 26 Nov 2022 02:27 IST

రాజశేఖర్‌ (పాత చిత్రం)

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: లారీ మరమ్మతుల నిమిత్తం రహదారి పక్కన నిల్చున్న వారిపైకి కారు దూసుకొచ్చిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని సాంబశివరావుపేటకు చెందిన బెల్లంకొండ రాజశేఖర్‌ (45)... త్రిపురాంతకంలోని ఇటుక బట్టీలకు లారీలో వరి పొట్టు సరఫరా చేస్తుంటారు. శుక్రవారం లోడు తెచ్చారు. టైరు పంక్చర్‌ కావడంతో... రాజుపాలెం సమీపంలోని దుకాణం వద్ద వేయించేందుకు రహదారి పక్కన వాహనం ఆపారు. విషయం తెలిసి ఆయన తండ్రి కొండలు సైతం అక్కడకు వచ్చారు. ఇరువురూ లారీ పక్కనే నిల్చుని మెకానిక్‌తో మాట్లాడుతుండగా... అటుగా వెళ్తున్న కారు వీరిపైకి దూసుకొచ్చింది. రాజశేఖర్‌, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హైవే, 108 అంబులెన్స్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వినుకొండ తరలిస్తుండగా... మార్గం మధ్యలో రాజశేఖర్‌ ప్రాణాలు విడిచారు. క్లీనర్‌ను వైద్యశాలలో చేర్పించారు. కుమారుడు... కళ్లెదుటే ఇలా మృత్యువాత పడడంతో తండ్రి కొండయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. కారు చోదకుడి నిర్లక్ష్యం వల్లే ఘటన చోటుచేసుకుందని వాపోయారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, బీటెక్‌ చదువుతున్న కుమారుడు, ఎంబీబీఎస్‌ చదువుతున్న కుమార్తె ఉన్నారు.


పొరబడి.. పురుగు మందు తాగి...

చికిత్స పొందుతూ రైతు మృతి

కొత్తపట్నం, న్యూస్‌టుడే: పొరపాటున పురుగుమందు తాగి ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని చాకిరేవు కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన పి.నాగభూషణం(38) తనకున్న కొద్దిపాటి పొలంలో కూరగాయలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 24న భార్యతో కలిసి ఆయన పొలం వద్దకు వెళ్లారు. దాహం వేయడంతో మంచినీరు అనుకుని పొరబడి అప్పటికే సీసాలో కలిపి ఉంచిన పురుగు మందు తాగారు. స్థానికులు ఒంగోలులోని సర్వజన వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగభూషణం గురువారం రాత్రి మృతి చెందారు. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని