logo

త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు... ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి.

Published : 28 Nov 2022 02:46 IST

టిప్పర్‌ను ఢీకొన్న అయ్యప్ప భక్తుల బస్సు
27 మందికి స్వల్ప గాయాలు

టిప్పర్‌ను ఢీకొట్టడంతో నుజ్జయిన బస్సు ఎదుటి భాగం

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు... ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి వేళ ఒంగోలు నగర శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండంలంలోని డీఎల్‌ పురం, గునిపూడి గ్రామాలకు చెందిన ముప్పై మంది అయ్యప్ప భక్తులు, వారి కుటుంబీకులు మరో పది మంది కలిసి... ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు (ఏపీ 16టీసీ 0022)లో శనివారం మధ్యాహ్నం శబరిమల బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి... ఒంగోలు నగర శివారులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల వద్దకు చేరారు. బస్సు డ్రైవర్‌ కాపవరపు నాగరాజు నిద్రమత్తులో... ముందు వెళ్తున్న టిప్పర్‌ను వేగంగా ఢీ కొట్టారు. ఆ ధాటికి బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. పెద్ద శబ్ధం రావడంతో లోపలున్న వారంతా భీతిల్లి హాహాకారాలు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఒంగోలు తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బస్సులో ఉన్న భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఐనపూడి అప్పలరాజు, అడగల అప్పలనాయుడు, బాజాల మంగ, పక్కుర్తి గణేష్‌, అల్లు నాగరత్నం, గిరిజాల కమలమ్మ, గిరిజాల అనసూయమ్మ, పురందాసు శ్రీను, గౌరీపట్నం కాంతం, గిరిజాల ధనుంజయ, గిరిజాల వెంకటలక్ష్మి, చొప్పా నాగేశ్వరరావు, కుక్కల శ్రీనివాసరావు, కె.జోగారావు, కురందాసు రమణ, గదుల ప్రసాద్‌, రాసారపు నరేష్‌, గిరిజాల కనకారావు, కొల్లి అప్పలకొండ, అమలకోట సూరిబాబు, వేమూరి రవికుమార్‌, గిరిజాల నూకాలమ్మ, మణికంఠ, డి.హరిప్రసాద్‌, జి.గోవింద్‌, జి.భవిష్యలతో పాటు డ్రైవర్‌ నాగరాజుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అందరికీ స్వల్ప గాయాలే కావడంతో ప్రథమ చికిత్స అనంతరం కొందరు స్వస్థలానికి తిరిగి వెళ్లిపోగా... మరికొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో శబరిమల వెళ్లారు. ఐనపూడి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

క్షతగాత్రులను బస్సులో నుంచి కిందకు దించుతున్న దృశ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని