logo

భూ అక్రమాలపై సీఐడీ నివేదిక ఏమైంది?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలుకు చెందిన ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా ప్రజలు బాలినేనికి చరమగీతం పాడటం ఖాయమన్నారు.

Published : 03 Feb 2023 01:57 IST

బాలినేనికి ప్రజలు చరమగీతం పాడటం ఖాయం
వైకాపా నేత సుబ్బారావు గుప్తా విమర్శ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలుకు చెందిన ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జిల్లా ప్రజలు బాలినేనికి చరమగీతం పాడటం ఖాయమన్నారు. తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట డమ్మీ పత్రాలు ఇచ్చి మోసం చేశారన్నారు. జింపెక్స్‌కు కేటాయించిన కొండలను పేదలకు కేటాయించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ఆ స్థలాన్ని విశాఖ రుషికొండ మాదిరిగా ధ్వంసం చేసి మట్టిని తరలించి రూ.30 కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. ఒంగోలులో జరిగిన భూ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిందని.. ఈ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. జిల్లాలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల అనుమతుల్లో తండ్రి రూ.2 కోట్లు, కుమారుడు రూ.60 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. కొత్తపట్నం వద్ద ఒక స్థిరాస్తి వ్యాపారి వెంచర్‌ను కొర్రీలు వేసి అడ్డుకుని డబ్బు దండుకున్నారన్నారు. ఇటీవల ఓ విల్లా ప్రాజెక్టులో రెండకరాల స్థలంతో పాటు భాగస్వామ్యం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి దురాగతాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. నగరానికి చెందిన నాయకుడు ఘనశ్యామ్‌పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. మండలాల్లో మనుష్యులను పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఒకే భూమిని నలుగురైదుగురికి విక్రయించి మోసాలు చేశారన్నారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 2019లో నమోదైన కేసులో ఇప్పటికీ ఎందుకు అరెస్టులు లేవని ప్రశ్నించారు. జిల్లాలో పోలీసింగ్‌ నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని.. రౌడీలు పోలీసులను సవాల్‌ చేసే దుస్థితికి దిగజారిందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు