logo

బడుల్లో నీతి.. నిజాయతీలు ఏవీ!

విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సామాజిక, మానసిక, వ్యక్తిగత విలువలతో కూడిన బోధన సాగాలనేది అందరి ఆశయం.

Published : 06 Feb 2023 01:51 IST

అటకెక్కిన కార్యక్రమాల అమలు
పర్యవేక్షణ విస్మరించిన అధికారులు

అరివేముల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు

పామూరు, సి.ఎస్‌.పురం- న్యూస్‌టుడే: విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సామాజిక, మానసిక, వ్యక్తిగత విలువలతో కూడిన బోధన సాగాలనేది అందరి ఆశయం. ఇందుకుగాను నీతి విద్య(మోరల్‌ ఎడ్యుకేషన్‌) పేరిట వినూత్న కార్యక్రమాలను విద్యావేత్తలు రూపొందించారు. గత ప్రభుత్వం వీటిని అమలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేసింది. ఇందులో భాగంగా నిజాయతీ, తపాలా పెట్టె, బాల సంఘాలు, స్నేహబాల, పొదుపు సంచాయక, పౌర నేస్తం, సామాజిక సేవ తదితర విద్యా విధానాలను పాఠశాల విద్యలో భాగం చేసింది. తద్వారా చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి కృషిచేసింది. అయితే ఆయా కార్యక్రమాల అమలు ప్రస్తుతం అటకెక్కింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, ఉపాధ్యాయులకు పలు బోధనేతర బాధ్యతలు అప్పగించడమూ ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వికసించని  స్నేహబాల...

స్నేహబాల కార్యక్రమంలో భాగంగా 1, 2, 3 తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు ఆట పాటలతో బోధించాల్సి ఉంటుంది. చిన్నారులు ఆసక్తిగా వీటిని నేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియ దాదాపు పాఠశాలల్లో ఇప్పుడు మరుగున పడింది.

కానరాని గోడపత్రికలు,  సంఘాలు...

విద్యార్థుల్లో చిత్రలేఖనం, ఇతర నైపుణ్యాలను వెలికి తీయడానికి గోడ పత్రిక కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో ఈ విధానం అమలు కావడంలేదు. నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి దోహదపడే బాలల సంఘాలు కూడా కనిపించడం లేదు. బాలల హక్కులు, పత్రికల నుంచి సమాచార సేకరణ, పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాల అమలు అటకెక్కింది.

* పొదుపు ఆవశ్యకతను వివరించి ఆ దిశగా చిన్నారులను ప్రోత్సహించడానికి పొదుపు సంచాయక పథకం అమలు చేయాల్సి ఉంది. ఒక ఉపాధ్యాయుడు ఈ బాధ్యత తీసుకునేవారు. విద్యార్థులు పొదుపు చేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో నమోదు చేసి ప్రధానోపాధ్యాయుడి పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి అందులో జమ చేసేవారు. ప్రారంభంలో విద్యార్థులకు బాగా చేరువైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో అమలుకు నోచుకోవడం లేదు.

తపాలా పెట్టె  జాడేది...

* రోజూ తరగతి గదిలో చోటుచేసుకున్న ఘటనలు, ఉపాధ్యాయుల బోధనా తీరు.. మధ్యాహ్న భోజన పరిస్థితి.. వింతలు, విశేషాలపై విద్యార్థులు ఉత్తరాలు రాసి వాటిని తపాలా పెట్టెలో వేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఊసూ ఇప్పుడు లేదు. ఫలితంగా ఉత్తరాలు రాసే నైపుణ్యం విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది.

* విద్యార్థుల్లో నిజాయతీని పెంపొందించేందుకు గాను పాఠశాలలో దొరికిన వస్తువులను పెట్టెల్లో వేసేలా ప్రోత్సహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అటువంటి పెట్టెల జాడే లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేపటి పౌరుల్లో నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని