logo

మా సమస్యలు ప్రభుత్వానికి కనిపించవా?

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌-హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం మహా ధర్నా చేపట్టారు.

Updated : 07 Feb 2023 06:44 IST

కలెక్టరేట్‌ వద్ద కదం తొక్కిన అంగన్‌వాడీలు

మహాధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌-హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం మహా ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, ఆయాలు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. కనీస వేతనాలు చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, ముఖ ఆధారిత యాప్‌ రద్దు చేయాలని, కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నినదించారు. టీఏ, డీఏలు గత అయిదేళ్లుగా చెల్లించడం లేదని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్ట్‌ల్లో గత 6 నెలల నుంచి బిల్లులు చెల్లించలేదన్నారు. ఇచ్చిన చరవాణులు పని చేయకపోగా, రకరకాల యాప్‌లు తీసుకొచ్చి పనిభారం పెంచారన్నారు. ఆహార కమిషన్‌, మండల అధికారులు, రాజకీయ నాయకులు తనిఖీల పేర్లతో కార్యకర్తలను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు అందజేశారు. డీఆర్వో ఓబులేసు ధర్నా వద్దకు వచ్చి కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు రెండో పట్టణ సీఐ రాఘవరావు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.


రాజకీయ వేధింపులు ఆపాలి

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. కార్యకర్తలు, ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సూపర్‌ వైజర్‌ పోస్టులకు వయో పరిమితిని తొలగించాలి.
పి.కల్పన, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌


టీఏ, డీఏలు ఇవ్వలేదు

గత అయిదేళ్లుగా అంగన్‌వాడీలకు టీఏ, డీఏలు ఇవ్వలేదు. 300 జనాభా దాటిన మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. కార్యకర్తలతో సమానంగా వేతనాలు ఇవ్వడంతోపాటు, అదనంగా ఆయాలను నియమించాలి. సంక్షేమ పథకాలను అమలు చేయాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలి. సర్వీసులో ఉండి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉదోగ్యం ఇవ్వాలి.  
ఈదర అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌-హెల్పర్స్‌ యూనియన్‌


1.75 పైసలతో భోజనమా?

కూరలు, గ్యాస్‌ సిలిండర్‌ ఇతరత్రా అన్ని ఖర్చులు కలిపి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజుకు రూ.1.75 చొప్పున ఇస్తే ఆ నగదుతో వారికి భోజనం ఎలా పెట్టాలి. కచ్చితమైన మెనూ పాటించడం సాధ్యమేనా? ఛార్జీలు పెంచాలి. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. రకరకాల యాప్‌లతో వంద పనులు చెబుతున్నారు. పనిభారంతో ఇబ్బందులు పెడుతున్నారు.
షేక్‌ ముంతాజ్‌, కార్యకర్త, పెద్దదోర్నాల

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని