logo

మనసు మార్చు మల్లన్నా...!

జిల్లాకు అత్యంత సమీపంలోని జ్యోతిర్లింగం శైవక్షేత్రం శ్రీశైలం. జిల్లా కేంద్రం నుంచి అక్కడికి నిత్యం భక్తుల తాకిడి ఉంటున్నా ఆర్టీసీ మాత్రం నేరుగా బస్సులు నడపడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.

Published : 08 Feb 2023 03:06 IST

ఆర్టీసీ యంత్రాంగం తీరుతో అవస్థలు ‌
ఒంగోలు నుంచి శ్రీశైలానికి బస్సులేవీ

న్యూస్‌టుడే, ఒంగోలు అర్బన్‌ : జిల్లాకు అత్యంత సమీపంలోని జ్యోతిర్లింగం శైవక్షేత్రం శ్రీశైలం. జిల్లా కేంద్రం నుంచి అక్కడికి నిత్యం భక్తుల తాకిడి ఉంటున్నా ఆర్టీసీ మాత్రం నేరుగా బస్సులు నడపడంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. మహా శివరాత్రి ఉత్సవాలకు రెండు మూడు రోజుల ముందు ప్రత్యేక బస్సులు నడిపి చేతులు దులుపుకుంటోంది. మిగతా రోజుల్లో వెళ్లే భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ఇతర డిపోల నుంచి వచ్చే బస్సులే వారికి గతవుతున్నాయి. ఆర్టీసీ యంత్రాంగం మనసు మారితేనే తప్ప తమకు ప్రయాణం కష్టాలు తప్పేలా లేవని భక్తులు వాపోతున్నారు.

ఒంగోలు నుంచి శ్రీశైలానికి దూరం 174 కిలోమీటర్లు. జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు చుట్టు పక్కల కొత్తపట్నం మండలం, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గంలోని కొన్ని మండలాల నుంచి భక్తులు శ్రీశైలం వెళ్లాలంటే  ఒంగోలు డిపో నుంచే వెళ్లాల్సింది. అయితే నేరుగా ఇక్కడి నుంచి ఒక్క బస్సు సర్వీసు కూడా లేకపోవడంతో వేరే డిపోల నుంచి వచ్చే వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శివరాత్రి, కార్తీక మాసం ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీˆ సాధారణ రోజుల్లో మాత్రం నడపటంపై ఆసక్తి కనబర్చడం లేదు.

అద్దంకి బస్సులే గతి

ప్రస్తుతం జిల్లా రీజియన్‌ పరిధిలోని కేవలం మార్కాపురం డిపో నుంచి మాత్రమే నేరుగా శ్రీశైలానికి తొమ్మిది బస్సులున్నాయి. ఇవి కాకుండా బాపట్ల జిల్లా అద్దంకి నుంచి ఏడు సర్వీసులు, చీరాల నుంచి ఓ సర్వీసు మాత్రమే నడుస్తున్నాయి. కొన్ని నెలల క్రితం కనిగిరి నుంచి శ్రీశైలానికి  ప్రజాప్రతినిధుల వినతుల మేరకు ఓ సర్వీసును ఏర్పాటు చేసి కేవలం నెల రోజులు మాత్రమే నడిపి నిలిపివేశారు. ప్రస్తుతం జిల్లా రీజియన్‌ పరిధిలో ఒంగోలు, పొదిలి, గిద్దలూరు, కనిగిరి డిపోల నుంచి ఒక్క సర్వీసు కూడా లేదు. దీంతో శ్రీశైలం వెళ్లి మల్లన్నను దర్శించుకునే భక్తులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది.


ప్రయాణికులతో నిండి..

ఒంగోలు డిపో నుంచి నేరుగా బస్సులు లేకపోవడంతో అద్దంకి డిపో నుంచి వచ్చే బస్సులే దిక్కవుతున్నాయి. ఒక్కోసారి రిజర్వేషన్‌ చేసుకొనేందుకు వీలు కావడం లేదని ప్రయాణికులంటున్నారు. వేరే డిపోల నుంచి వచ్చే బస్సులు ప్రయాణికులతో నిండి వస్తున్నాయి. దాదాపు అయిదు గంటల పాటు నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. ఒంగోలు నుంచి మార్కాపురం వరకు ఓ బస్సులో వెళ్లి అక్కడి నుంచి శ్రీశైలం బస్సు ఎక్కి వెళ్లాల్సిన దుస్థితి.  పొదిలి డిపో, కనిగిరి, గిద్దలూరు డిపోల పరిధిలో భక్తులు మార్కాపురం వచ్చి వెళ్లాల్సిందే. భక్తులు శివ జ్యోతిర్లింగం దర్శించుకొనేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఆర్టీసీˆ అధికారులు ఒంగోలు డిపోతో పాటు మిగిలిన డిపోల నుంచి ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా నేరుగా బస్సులు నడిపేలా చూడాలని పలువురు భక్తులు కోరుతున్నారు.


శ్రీగిరి.. ఆధ్యాత్మిక ఝరి
- ఈనాడు, కర్నూలు

శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు శ్రీగిరి ముస్తాబవుతోంది. ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. నడక దారిలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్షలాది మంది తరలిరానుండటంతో తాత్కాలికంగా షామియానాలు వేసి వసతి కల్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని