logo

రుణాల సొమ్ము స్వాహా

స్వయం ఉపాధి నిమిత్తం డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణ నగదును తిరిగి చెల్లించినప్పటికీ బ్యాంకులో జమ చేయకుండా సమాఖ్య అధ్యక్షురాలు చేతివాటం చూపడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 21 Mar 2023 06:19 IST

కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదుచేసిన మహిళలు

జేసీ అభిషిక్త్‌ కిషోర్‌కు సమస్యను వివరిస్తున్న మహిళలు

టంగుటూరు, న్యూస్‌టుడే: స్వయం ఉపాధి నిమిత్తం డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణ నగదును తిరిగి చెల్లించినప్పటికీ బ్యాంకులో జమ చేయకుండా సమాఖ్య అధ్యక్షురాలు చేతివాటం చూపడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం దాదాపు 60 మంది గ్రామం నుంచి ట్రాక్టర్లలో తరలివచ్చి మరీ కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌కు ఫిర్యాదుచేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు 2014లో టంగుటూరు మండలం ఆలకూరపాడు క్లస్టర్‌ 1కు గ్రామ సంఘ అధ్యక్షురాలిగా అరుణ, సీసీగా గోవిందమ్మలు విధులు నిర్వహించారు. వీరి పరిధిలో 20 గ్రూపులు, 200 మంది మహిళా సభ్యులు ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఎస్సీ, ఎస్టీల ఉన్నతికి వడ్డీ లేని రుణాలు, హెచ్‌డీ, వీఆర్‌ఎఫ్‌, ఇతర గ్రూపుల కింద సుమారు రూ.15 లక్షల నగదును సభ్యులకు అందించారు. 2015 సంవత్సరం ప్రారంభం నుంచే వారు తిరిగి చెల్లింపులు ప్రారంభించారు. బ్యాంకుకు జమ చేయమని చెప్పి అరుణకు ప్రతీ నెల రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు అందించారు. రెండేళ్లపాటు ఆమె బ్యాంకుకు చెల్లించలేదు. మరో విడత రుణం పొందేందుకు కొన్ని గ్రూపుల మహిళలు వెలుగు కార్యాలయం వద్దకు వెళ్లడంతో విషయం బయటపడింది. దీంతో బాధితులు న్యాయం చేయాలని కోరుతూ జేసీకి వినతిపత్రం అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ బాబురావు టంగుటూరు మండల సమాఖ్య కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించారు. మొత్తం రూ.8.83 లక్షల నిధుల స్వాహాకు సమాఖ్య అధ్యక్షురాలు అరుణ కారణమైందంటూ గుర్తించారు. ఆమెతో అక్కడి నుంచి పీడీ చరవాణి ద్వారా మాట్లాడారు. విశాఖలో ఉన్నానని, మరో రెండు రోజుల్లో వచ్చి నగదు క్లియర్‌ చేయనున్నట్లు సమాధానం వచ్చింది.. లేకుంటే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని పీడీ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని