logo

జనంలోకి నాయక గణం అడుగులు...

వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.

Updated : 27 Mar 2023 06:19 IST

నియోజకవర్గాల వారీగా తెదేపా ప్రణాళికలు
శ్రేణుల్లో ఉత్సాహం నింపిన వరుస విజయాలు
నిస్తేజంలో ‘అధికార’ నేతలు, కార్యకర్తలు

‘పల్లె పల్లెకు తెలుగుదేశం’ పేరుతో గ్రామాల్లో పర్యటించేందుకు కనిగిరి  మాజీ ఎమ్మెల్యే ఉగ్ర తయారు చేయించిన  ప్రచార రథం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు జనంలోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లు కూడా మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ‘బాదుడే-బాదుడు’; ఇదేమి ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమాల ద్వారా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలుపుతున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు, నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులు, ఇతర నాయకులు ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను తొలగించడంపై బాధిత కుటుంబాలతో మాట్లాడి భరోసా ఇస్తున్నారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, మున్సిపాలిటీల్లో చెత్త పన్ను, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధితో పాటు, వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనుల గురించి వివరించారు. తాజాగా మరిన్ని కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సమాయత్తమయ్యారు.

కొనకనమిట్లలో పాదయాత్రగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి,

కొండపి ఎమ్మెల్యే  బాలవీరాంజనేయస్వామి, తెదేపా శ్రేణులు

* వచ్చే నెలలో చురుగ్గా...: కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వచ్చే నెల మొదటి పక్షంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో నియోజకవర్గంలో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను గోడపత్రాలు, కరపత్రాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

* ‘ఛాయ్‌ పే చర్చ’ పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపాలిటీలో మూడు నెలలపాటు గతంలో విస్తృతంగా పర్యటించారు. వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ‘పల్లె పల్లెకు తెలుగుదేశం’ పేరుతో కార్యాచరణ చేపట్టారు. ఇందుకు అవసరమైన ప్రచార రథాన్ని విజయవాడలో ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చారు. మండలాల వారీగా ప్రతి కుటుంబాన్ని కలవాలనే లక్ష్యంతో ప్రణాళిక చేస్తున్నారు.

* ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒంగోలు నగరంలోని అన్ని డివిజన్లలో వచ్చే నెల నుంచి పాదయాత్ర చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కూడా సిద్ధమయ్యారు. వారంలో మూడు రోజులపాటు ఒంగోలు, కొత్తపట్నô మండలాల్లో పర్యటించనున్నారు.

* వచ్చే నెల మొదటి వారం నుంచి యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌తో పాటు, మార్కాపురం జిల్లా సాధన, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని మండలాల్లో పాదయాత్ర కొనసాగేలా త్రిపురాంతకం అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ దిశగా ఆయా నాయకులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

ఒంగోలులో సమస్యలు నమోదు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌(పాత చిత్రం)

శ్రీకారం చుట్టిన కందుల..

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటు, మార్కాపురం జిల్లా సాధన,  ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కొనకనమిట్లలోని వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసి అడుగు ముందుకేశారు. అధికసంఖ్యలో తెదేపా శ్రేణులు తరలిరాగా.. కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ముఖ్య    అతిథిగా ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

వైకాపాలో  మార్పులపై చర్చ...

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చూపాం. తర్వాత పంచాయతీ, పరిషత్‌, పురపాలక ఎన్నికల్లోనూ తిరుగులేని గెలుపులను సొంతం చేసుకున్నామంటూ వైకాపా శ్రేణులు ఇప్పటి వరకు ధీమా వ్యక్తం చేశాయి. ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి మూడు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ వ్యూహాత్మక గెలుపుతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఇందులో భాగస్వామ్యం ఉండటంతో ప్రభుత్వ పరిపాలనపై ఉన్న వ్యతిరేకత ఏమిటో స్పష్టంగా అర్థమైందంటూ వైకాపా నాయకులు, కార్యకర్తల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. దీనికితోడు ఇటీవల జిల్లాలో సర్వే చేశారని.. మూడు, నాలుగు స్థానాల్లోని ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత దృష్ట్యా సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తల్లోనే విస్తృత ప్రచారం నడుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు