logo

చర్మకారుల ఉపాధికి సున్నం

చర్మకారులకు ఉపాధి కల్పించాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన లెదర్‌ పార్క్‌ అది. తొలినాళ్లలో కొందరిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఉన్నతాశయం నీరుగారగా.. విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

Published : 03 Jun 2023 02:21 IST

దశాబ్దాల క్రితం నిర్మాణం
కార్యకలాపాలు లేక నిరుపయోగం
రాచర్ల, న్యూస్‌టుడే:

యడవల్లి వద్ద అలంకారప్రాయంగా మిగిలిన షెడ్డు

చర్మకారులకు ఉపాధి కల్పించాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన లెదర్‌ పార్క్‌ అది. తొలినాళ్లలో కొందరిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఉన్నతాశయం నీరుగారగా.. విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. గిద్దలూరు నియోజకవర్గంలో సుమారు పది వేల వరకు చర్మకారుల కుటుంబాలున్నాయి. వీరికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించాలని నాటి పాలకులు సంకల్పించారు. ఇందుకుగాను రాచర్ల మండలం యడవల్ల్లి రెవెన్యూలో సర్వే నంబరు 781/2, 953లో 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని రెండు దశాబ్దాల క్రితమే సేకరించారు. 2003లో మినీ లెదర్‌ పార్క్‌ ఏర్పాటు పనులను నాటి ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కార్మికులకు శాశ్వత నివాస గృహాలు, వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఉపయుక్తమైన పాఠశాల, అలాగే బ్యాంకు, పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. మొదటిగా శిక్షణకు అవసరమైన ఒక షెడ్డును రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించారు. అనంతరం విద్యుత్తు లైన్లు, పరివర్తకం ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆపై ఇటుగా చూసిన అధికారులు, పాలకులు లేకపోయారు. దీంతో విద్యుత్తు తీగలు దొంగలపాలయ్యాయి. అలంకారప్రాయంగా మిగిలిన పరివర్తకాన్ని అధికారులే తొలగించారు. లెదర్‌ పార్క్‌ కోసం సేకరించిన భూముల్లో ఇతరులు సాగు చేపడుతున్నారు.

షెడ్డు మూసి వేసి.. యంత్రాలు తరలించి...: చర్మకారులకు శిక్షణ ఇచ్చేదుకు గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన 40 మందిని గతంలో ఎంపిక చేశారు. వీరికి తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అధికారులు శిక్షణ ఇప్పించారు. అనంతరం వీరితో చెప్పులు, బూట్లతో పాటు ఇతర చర్మ ఆధారిత వస్తువులు తయారు చేయించాలని.. వాటికి మార్కెటింగ్‌ చూపి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం. ఇందుకోసం కొన్ని యంత్రాలు కూడా ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వారు గిద్దలూరులో మరికొందరికీ తర్ఫీదు ఇచ్చారు. ఇక అంతా సక్రమంగా సాగుతుంది అనుకునేంతలో షెడ్డును మూసి వేశారు. చర్మకారులకు శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలను ఇక్కడి నుంచి విజయవాడ తరలించారు.

ఇతర ప్రాంతాలకు వలస...: లెదర్‌ పార్కు మూతపడటంతో శిక్షణ పొందిన చర్మకారులు చేసేందుకు పని లేకపోయింది. దీంతో జీవనోపాధి కోసం వారంతా రాడ్‌ బెండింగ్‌, బేల్దారీ, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, హుబ్లీ తదిరత ప్రాంతాలకు వలస వెళ్లి పొట్టపోసుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి లెదర్‌ పార్క్‌ను తిరిగి గాడిలో పెట్టి చర్మకారులకు ఉపాధి చూపాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని