logo

సుగంధం.. సాగు చేద్దాం...

సీఎస్‌ఐఆర్‌ అరోమా మిషన్‌-3.0లో భాగంగా జిల్లాలో సుగంధ పంటల సాగు ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు, కామాక్షి కసువు సాగుకు జిల్లాలో అనువైన వాతావరణం ఉందని అధికారులు గుర్తించారు.

Published : 03 Jun 2023 02:21 IST

జిల్లాలో అనుకూలమైన నేలలు
ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ కార్యక్రమాలు
ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

కొత్తపట్నంలో వట్టివేరు పంటను పరిశీలిస్తున్న అధికారులు

సీఎస్‌ఐఆర్‌ అరోమా మిషన్‌-3.0లో భాగంగా జిల్లాలో సుగంధ పంటల సాగు ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు, కామాక్షి కసువు సాగుకు జిల్లాలో అనువైన వాతావరణం ఉందని అధికారులు గుర్తించారు. ఆ మేరకు రైతులను సాగుకు ప్రోత్సహించే దిశగా అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఆరోమా మిషన్‌1, 2 కింద విరివిగా సుగంధాల సాగు చేపడుతున్నారు. మిషన్‌ 3లో భాగంగా దక్షిణ భారతదేశంలోని కేరళలో అత్యధికంగా, తమిళనాడు, కర్ణాటకలో ఈ తరహా పంటల సాగు చేపట్టారు. ఈ రకం పంటలు సాగవుతుండగా రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో రైతులు ముందుకొస్తున్నారు.

జిల్లాలో ఎక్కడెక్కడంటే...

జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో గడికోట, కొమరోలు, దద్దవాడ, సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి పరిధిలోని పల్లామల్లి, మార్కాపురం నియోజకవర్గంలోని రాయవరం, నాయుడుపల్లి, ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం, ఈతముక్కల ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 150 ఎకరాల్లో నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు రకం సుగంధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో ఈ దిశగా మరింత ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో సుగంధ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

నిమ్మగడ్డి

మనకు అనుకూలమైన రకాలు ఏవంటే...

* నిమ్మగడ్డి ద్వారా లభించే నూనెను ప్రధానంగా సబ్బులు, సువాసనలు వెదజల్లే పదార్థాల్లో వినియోగిస్తున్నారు. దీన్ని వర్షాధార, నీటిపారుదల పంటగా సాగు చేయవచ్చు. అధిక సూర్యరశ్మి, తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రాంతాలు, సారవంతమైన నేలల్లో బాగా పెరుగుతుంది. ఇసుక నేలల్లో అయితే ఎరువులు అధికంగా వినియోగించాలి. * కాశగడ్డి(పామరోజ) పంట ద్వారా వచ్చే తైలాన్ని కూడా సబ్బులు, పొగాకు, ఆహార పదార్థాల సువాసనలు పెంచేందుకు, దోమల నివారణ మందుల తయారీలో వినియోగిస్తారు. దీన్ని అన్నికరాల నేలల్లో సాగు చేయవచ్చు. * కామాక్షి కసువు(సిట్రోనెల్లా) రకం తైలాన్నీ సబ్బులు, అగర్‌బత్తీలు, లేపనాలు, దోమల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఎర్రనేలల్లో ఈ పంట బాగా వస్తుంది. * వట్టివేరు సుగంధ తైలాన్ని పరిమళభరితమైన సబ్బులు, శీతల పానీయాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ గడ్డి వేర్లను బుట్టలు, చేతి సంచులు, చాపల తయారీకి కూడా వినియోగిస్తారు. ఆయా పంటల సాగుకు ఇప్పుడిప్పుడే జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్‌ తెలిపారు.

చీమకుర్తి మండలం పల్లామల్లిలో ఓ రైతు నుంచి వివరాలు తెలుసుకుంటున్నఅధికారులు

అనువైన నేలలు.. అధిక ఆదాయం...

జిల్లాలో సుగంధ పంటల సాగుకు అనువైన నేలలు, వాతావరణం ఉంది. ఈ పంటలపై రైతులు సాగుకు మొగ్గుచూపితే మంచి ఫలితాలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసి నాలుగైదేళ్లపాటు అధిక ఆదాయం పొందవచ్చు. ఇటీవలే సదస్సు ద్వారా సుగంధ పంటలపై రైతులకు అవగాహన కల్పించాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదింది మరిన్ని వివరాలు తెలసుకుని సాగుకు ఉపక్రమించవచ్చు.

దినేష్‌ కుమార్‌, కలెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని