logo

విద్యుత్తు కార్యాలయంలో అగ్నికీలలు

కర్నూలు రోడ్డులోని విద్యుత్తు శాఖ నిర్వహణ విభాగం (మెయింటినెన్స్‌ యూనిట్‌)లో సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Published : 07 Jun 2023 03:27 IST

సిబ్బంది తక్షణ స్పందనతో తప్పిన పెనుముప్పు

అగ్నికి ఆహుతైన పరివర్తకాలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు రోడ్డులోని విద్యుత్తు శాఖ నిర్వహణ విభాగం (మెయింటినెన్స్‌ యూనిట్‌)లో సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా నిప్పురవ్వలు పడి... మరమ్మతుల కోసం అక్కడ ఉంచిన పాత విద్యుత్తు పరివర్తకాలకు మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోని విస్తరించి భారీస్థాయిలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ సమీపంలోనే ఆయిల్‌ డ్రమ్ములు నిల్వ ఉండటంతో విద్యుత్తు శాఖ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒంగోలు కేంద్రం అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రెండు శకటాలతో సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఆయిల్‌ నిల్వలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పక్క గదిలోనే ఒక్కోటి రూ.కోటి విలువ చేసే నాలుగు భారీ విద్యుత్తు పరివర్తకాలు ఉన్నాయి. వీటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదంలో పాత పరివర్తకాలు దగ్ధమై రూ.ఆరు లక్షల నష్టం వాటిల్లినట్లు విద్యుత్తు అధికారులు ప్రకటించారు. ప్రమాదంపై శాఖాపరమైన విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఈ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. విచారణ అధికారిగా ఈఈ డి.శ్రీనివాసులును నియమించినట్లు పేర్కొన్నారు.

ఎగసి పడుతున్న మంటలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని