logo

పట్టు జారిపోతా ఉంది...

పట్టు సాగు చేసే రైతులు, దారం తీసే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వారికి అందించాల్సిన ప్రోత్సాహకాలు మూడేళ్లుగా అందడం లేదు.

Published : 10 Jun 2023 06:02 IST

సాగుకు కానరాని ప్రోత్సాహకాలు

మూడేళ్ల్లుగా అందని ప్రభుత్వ రాయితీలు
మూతపడుతున్న దారం తీసే కేంద్రాలు

కంభం, బేస్తవారపేట గ్రామీణం- న్యూస్‌టుడే: పట్టు సాగు చేసే రైతులు, దారం తీసే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వారికి అందించాల్సిన ప్రోత్సాహకాలు మూడేళ్లుగా అందడం లేదు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణితో రైతులు, కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 ఎకరాల్లో మల్బరీ సాగులో ఉంది. ఇందులో పశ్చిమంలోని మార్కాపురం డివిజన్‌లోనే 1,160 ఎకరాల్లో కర్షకులు సాగు చేశారు. బేస్తవారపేట, కంభం, గిద్దలూరు, మార్కాపురం, తర్లుపాడు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాల్లో ఈ తోటలు అత్యధికం. ఈ ఏడాది కొత్తగా మరో 210 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు లక్ష్యంగానూ నిర్ణయించుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయితీలు అందకపోవడం.. ధరలు నానాటికీ దిగజారుతుండటంతో రైతులు పట్టు సాగుకు విముఖత ప్రదర్శిస్తున్నారు.

* స్థానికంగా లేని మార్కెట్‌...: గతంలో పండించిన పట్టుగూళ్లపై కిలోకు రూ. 50 వరకు ప్రోత్సాహంగా అందించేవారు. ప్రస్తుతం ఆ ఊసే లేకపోతోంది. గత మూడేళ్లుగా ఒక్కో రైతుకు ఏడాదికి రూ. లక్ష వరకు ప్రోత్సాహకాలు అందాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రూ.12 కోట్ల మేర బకాయిలున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోనూ సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. గత ప్రభుత్వం రైతులకు రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందజేశారు. మూడేళ్లుగా డ్రిప్‌ రాయితీలు నిలిపివేశారు. తిరిగి మళ్లీ ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. గతంలో షెడ్ల నిర్మాణాలకు రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు వీటికి కూడా సక్రమంగా అందిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మార్కెట్‌లో బైవోల్టెన్‌ పట్టు గూళ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో కర్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో పట్టుగూళ్ల మార్కెట్‌ అందుబాటులో లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో హిందూపురం, పలమనేరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సరైన రవాణా సౌకర్యం లేకపోవడమూ సమస్యగా మారింది.
* కూలీలకు బతుకుదెరువూ కరవు...: జిల్లాలో పట్టు దారం తీసే కేంద్రాలు మూడింటిని బేస్తవారపేటలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. కొన్నేళ్లు బాగానే నడిచాయి. కరోనా తర్వాత పట్టు గూళ్ల ధరలు పెరిగిపోవడం, దారం తీసేందుకు నిపుణులైన పనివారు లేకపోవడం, విద్యుత్తు ఛార్జీలు పెరగడం తదితర కారణాలతో అవికాస్తా మూతపడ్డాయి. కిలో పట్టు దారానికి ప్రభుత్వం రూ. 130 ప్రోత్సాహకంగా గతంలో అందించేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ఊసేలేదు. ఇందుకు సంబంధించి రూ. లక్షల్లో బకాయిలు అందాల్సి ఉంది. ఆయా కేంద్రాలు పనిచేస్తూ ఉంటే ఒక్కో దాంట్లో సుమారు 20 మందికి ఉపాధి లభించేది. అవి మూతపడడంతో పలువురికి బతుకుదెరువు కూడా లేకుండా పోయినట్లైంది.


ప్రభుత్వానికి నివేదించాం...

పట్టు రైతులకు రావాల్సిన ప్రోత్సాహకాలపై ఆయా మార్కెట్ల వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. వాటిని ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విడుదల చేస్తే రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. షెడ్ల రాయితీ, ఇతర బకాయిలపై ఉన్నతాధికారులకు తెలిపాం. రైతులకు కూడా ప్రోత్సాహకాలు రావాల్సి ఉన్నది వాస్తవం. అయితే వాటిపై మాకు పూర్తి సమాచారం ఉండదు.
నారాయణరెడ్డి, పట్టు పరిశ్రమ ఏడీ, మార్కాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని