logo

తలుపు తట్టనున్న ఓటు

సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. మే 13న పోలింగ్‌ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది.

Updated : 28 Mar 2024 06:34 IST

ఇంటి వద్దే వినియోగానికి చోటు
విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులే అర్హులు
దరఖాస్తుకు ఏప్రిల్‌ 22 తుది గడువు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. మే 13న పోలింగ్‌ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లలేని శారీరక విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు(85 సంవత్సరాలు పైబడినవారు) ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకుగాను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లేదా సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అధికారులు స్వయంగా పరిశీలించి వాస్తవమైతే ఇంటి వద్దే ఓటు వేసేలా అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియకు జిల్లా స్థాయిలో ఒడా వైస్‌ ఛైర్మన్‌ విశ్వేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

అధికారులకు ముందుగా తెలిపితేనే...: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే శారీరక విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారులు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 24,175 మంది విభిన్న ప్రతిభావంతులు, 7,784 మంది వయో వృద్ధులున్నట్లు గుర్తించారు. ఆ రెండు విభాగాల కింద పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే వారిని ముందుగా పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్వోలు) క్షేత్రస్థాయిలో గుర్తించి ఫారం-12డీ అందజేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో పూరించిన తర్వాత సదరు దరఖాస్తును తిరిగి బీఎల్వోలకు అందజేయాలి. అనంతరం వాటిని నియోజకవర్గ ఆర్వోలకు బీఎల్వోలు ఇవ్వనున్నారు. ఎవరైనా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేస్తామని చెబితే వారికి 12డీ దరఖాస్తులు ఇవ్వరు.

ఈ పత్రాలు తప్పక అవసరం...: 12డీ దరఖాస్తును బీఎల్వోకు అందజేసేందుకు ఏప్రిల్‌ 22వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. దీంతోపాటు, ఎపిక్‌ కార్డు, విభిన్న ప్రతిభావంతులైతే ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. వయో వృద్ధులైతే ఓటర్ల జాబితాలోనే వయస్సును ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇంటి దగ్గరే ఓటేసేందుకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పోస్టల్‌ బ్యాలెట్‌లను ముద్రిస్తారు.

రహస్య పద్ధతిలో ఓటింగ్‌...: అర్హులతో మే 4 నుంచి 10వ తేదీలోపు ఇంటి వద్దనే ఓటు వేయించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. దరఖాస్తుదారుల ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్‌ వ్యాన్‌లో వస్తారు. అందులో ఇద్దరు పోలింగ్‌ అధికారులు, ఒక వీడియోగ్రాఫర్‌, మరో రక్షణ అధికారి ఉంటారు. అక్కడ ఓటరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. అధికారులు నిర్దేశించిన పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్‌ పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తిగా వీడియోలో చిత్రీకరిస్తారు. ఆ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా సమాచారం అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని