logo

నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా

గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Published : 20 Apr 2024 02:58 IST

ఇష్టారీతిన ప్రదర్శనలు 
ఏరులై పారిన మద్యం

ఓ మద్యం దుకాణం వద్ద వైకాపా కార్యకర్తలు

గిద్దలూరు పట్టణం, బేస్తవారపేట న్యూస్‌టుడే : గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైకాపా నాయకులు గిద్దలూరులోని బార్‌ నుంచి సంచుల్లో మద్యం తీసుకెెళ్లి పంచిపెట్టారు. అర్థవీడు, కంభం, బేస్తవారపేట మండలాల నుంచి లారీలు, బొలేరోలు, ఆటోలు తదితర వాహనాల్లో కార్యకర్తలను బేస్తవారపేట మీదుగా గిద్దలూరుకు తరలించారు.  బేస్తవారపేట లోని ఆర్కే నగర్‌ జంక్షన్‌లోని మూడు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్దకు నేరుగా వారి వాహనాలతో చేరుకోవాల్సిందిగా తెలిపి ఒక్కొక్కరికి రూ.200 నగదు ఇచ్చి మనిషికో క్వార్టర్‌ చొప్పున తెచ్చుకోమని అక్కడే నగదును పంచారు. నగదును తీసుకున్న వారు మద్యం దుకాణాలపై ఒక్కసారిగా ఎగబడటంతో కొద్దిసేపు ఆయా దుకాణాల వద్ద తోపులాట జరిగింది. ప్రభుత్వ దుకాణాల వద్ద సిట్టింగ్‌కు అనుమతి లేకపోయినప్పటికీ కార్యకర్తలు యథేచ్ఛగా అక్కడే కూర్చుని మద్యం తాగారు.పందిళ్లపల్లి గ్రామ సమీపంలో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ఉండటంతో పలువురు వైకాపా నాయకులు కార్లలో వచ్చి సంచుల్లో మద్యం సీసాలను నింపుకుని పెద్ద ఎత్తున అక్కడికి తరలించారు. వైకాపా కార్యకర్తలు తమ వాహనాలను రహదారిపై అడ్డదిడ్డంగా ఎక్కడికక్కడ నిలిపివేయడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బార్‌ నుంచి వైకాపా నాయకులు సంచుల్లో మద్యం తరలిస్తున్నప్పటికీ ఎంసీసీ టీమ్‌ అధికారులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. రాచర్ల రహదారిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ర్యాలీ ఒక వైపు ఉండేలా పర్యవేక్షించాల్సి పోలీసులు పట్టిపట్టనట్లు వ్యవహరించడంతో స్థానికులు మండుటెండలో నానా ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని